Friday, May 31, 2024

ADB : దొంగల ముఠా అరెస్ట్… రూ.11.72 లక్షల సొత్తు రికవరీః సీపీ శ్రీ‌నివాస్‌

మంచిర్యాల‌, ప్ర‌భ‌న్యూస్ః రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠా (7గురు నేరస్తులు)ను అరెస్ట్ చేసినట్లు రామగుండం పోలీస్ క‌మిష‌న‌ర్‌ ఎం.శ్రీనివాస్ తెలిపారు. శనివారం నేర‌స్తుల‌ను మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పాగిడి కార్తీక్, తాటికొండ స్వామి చరణ్, పుప్పాల రాహుల్, గన్నవరం మధూకర్, కుర్సింగ ఈశ్వర్, మడావి రాము, వెడ్మ ప్రవీణ్ అనే నేరస్తులు గత కొంత కాలంగా తాళం వేసి ఉన్న ఇండ్లను గమనిస్తూ రాత్రి వేళల్లో ఇనుప రాడ్లతో తాళాలను పగలగొట్టి ఇండ్లలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, ఇతరత్రా సామాగ్రిని దొంగిలిస్తూ వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలా దొంగతనం చేసిన సొత్తును కరీంనగర్ కు వెళ్లి అమ్మేందుకు నిర్ణయించుకొని అదే ముఠాలోని నేరస్తుడైన మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన స్వామిశరణ్ అలియాస్ మున్నా ఇంట్లో ఉన్నట్లు సమాచారం రాగా తమ సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా వారు చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారన్నారు.

వీరి వద్ద నుండి రూ.9.22 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, రూ.60వేల విలువ గల వెండి ఆభరణాలు, రూ.50వేల విలువ గల బైక్, రూ.1.20 లక్షల విలువ గల టీవి, హోమ్ థియేటర్, రూ.20వేల విలువ గల గిటార్, మొత్తం రూ.11.72 లక్షల విలువ గల సొత్తును రికవరీ చేయడం జరిగిందని చెప్పారు. జనవరి నెల నుంచి మే నెల వరకు జరుగుతున్న వరుస దొంగతనాలపై దృష్టి సారించిన పోలీస్ శాఖ సివిల్, సీసీఎస్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నేరస్తులను పట్టుకునేందుకు ఆ బృందం తమదైన శైలిలో కృషి చేసిందని, ఇందులో భాగంగానే ఈ నేరస్తులపై నిఘా పెట్టి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నేరస్తులను పట్టుకునేందుకు విధుల్లో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు వారికి రివార్డులను అందించారు. ఈ సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, మంచిర్యాల టౌన్ సీఐ బన్సీలాల్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement