Monday, April 29, 2024

ADB: జెడ్పీటీసీ పదవికి అనిల్ జాదవ్ రాజీనామా..

బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన అనిల్ జాదవ్ ఇవాళ ఆదిలాబాద్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసి నేరడిగొండ జెడ్పీటీసీ పదవికి రాజీనామా సమర్పించారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అనిల్ జాదవ్ తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా లేఖను కలెక్టర్ కు అందజేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కు కలెక్టర్ అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నను అనిల్ జాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి తన విజయానికి సహకరించినoదుకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా కప్పి రామన్నను సన్మానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంట ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, గాడ్గే సుభాష్ పాటిల్ తదితరులు ఉన్నారు.


ఖాళీ అయిన రెండు జెడ్పీటీసీ స్థానాలు..
అనిల్ జాదవ్ జెడ్పీటీసీ పదవికి రాజీనామాతో ఆదిలాబాద్ జిల్లాలో రెండు జెడ్పీటీసీ పదవులు ఖాళీ అయ్యాయి. గతంలో కోవిడ్ సమయంలో ఆదిలాబాద్ జెడ్పీటీసీ, వైస్ చైర్మన్ ఆర్య రాజన్న మృతిచెందిన నేపథ్యంలో ఇప్పటివరకు ఈ ఖాళీ స్థానంలో ఎన్నిక జరగలేదు. ఖాళీగా ఉన్న ఈ రెండు స్థానాల్లో ఎన్నిక జరిగితే రాజకీయ సమీకరణలు మరోసారి వేడెక్కే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement