Monday, May 20, 2024

ప‌ద్మ‌భూష‌ణ్ తో.. మ‌రింత బాద్య‌త పెరిగింది..చిన‌జీయ‌ర్ స్వామి

వికాస్ త‌రంగిణి..జీయ‌ర్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్ ద్వారా ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి చేస్తున్న సేవ‌ల‌కు గుర్తింపుగా ప్ర‌భుత్వం ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుతో స‌త్క‌రించింది.ఈ అవార్డు రావ‌డంపై చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. వికాస తరంగిణి, జీయర్ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అని తెలిపారు. ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని ఆచరించినా సరే సామాజిక సేవ విషయంలో అంతా కలిసి పనిచేయాలనే లక్ష్యంతో ‘స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ’ నినాదం తీసుకొచ్చామని చినజీయర్ స్వామి తెలిపారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ, ఇతర ధర్మాలను ఆదరిస్తూ కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా సేవ చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్పందించి, సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.

వికాస తరంగిణి ద్వారా గర్భకోశ క్యాన్సర్ బాధితుల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, నేపాల్‌లో సుమారు 20 లక్షల మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, 6-7 లక్షల మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. మనిషి అత్యాశే ప్రకృతి వైపరీత్యాలకు కారణమని చినజీయర్ స్వామి చెప్పారు. ఒక జంతువు మరో జంతువును అవసరానికే చంపుతుందని, మనిషి మాత్రం అత్యాశతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సేవయే మాధవ సేవ అనే మాటను సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ గా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గుడికి, గుండెకు మాత్రమే భగవంతుడు పరిమితం కాడు, ఆయన సర్వాంతర్యామి. ప్రపంచం మొత్తం ఆయన శరీరమే. ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా భగవంతుడి శరీరానికి హాని కలిగినట్లుగా భావించి, సేవ చేయాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement