Monday, April 29, 2024

వార‌సుడు.. దిల్ రాజుకి కాసులు కురిపించేనా.. మూవీ రివ్యూ

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన చిత్రం వారీసు..తెలుగులో వార‌సుడు..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన చిత్రం ఇది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

క‌థ ఏంటంటే.. రాజేంద్రన్ (శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ మెన్. వేల కోట్లకు అధిపతి. తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్)లో ఒకరికి అప్పచెప్పాలని ఆశ పడతాడు. అయితే దానికి తగిన అర్హత నిరూపించుకోవాలని కోరతాడు. దాంతో తనకు అవన్నీ వద్దు.. తన ప్రపంచం వేరు అంటూ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు విజయ్. జై, అజయ్ మాత్రం తండ్రి కుర్చీపైనే ఉంటుంది. అదే సమయంలో వ్యాపార ప్రత్యర్ధులు జయ ప్రకాష్ (ప్రకాష్ రాజ్) రాజేంద్రన్ కంపెనీపై కన్నేస్తాడు. అదే సమయంలో అనుకోని సమస్యలో ఇరుక్కుంటాడు రాజేంద్రన్. దాంతో కచ్చితంగా తన వారసుడిని ఎంపిక చేసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడుతుంది. అప్పుడే ఏడేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్న విజయ్ అమ్మ కోసం మళ్లీ వస్తాడు. తన తెలివితేటలతో బిజినెస్‌లో నాన్న కంపెనీని ఎలా కాపాడాడు.. విడిపోయిన కుటుంబాన్ని మళ్లీ ఎలా కలిపాడు అనేదే కథ..

- Advertisement -

విశ్లేష‌ణ‌.. ఫ్యామిలీ కథల్లో కొత్తగా చెప్పడానికి ఏముండదు.. ఎమోషన్స్ సరిగ్గా వర్కౌట్ అయితే అంతకంటే అద్భుతమైన కథ మరొకటి ఉండదు. వారసుడులో ఈ ఎమోషన్స్ అన్నిచోట్ల వర్కౌట్ అవ్వలేదు. పైగా సంక్రాంతికి రొటీన్ సినిమాల రేస్ నడుస్తుంది. ఒకరిని మించి మరో దర్శకుడు పరమ రొటీన్ కథలతో వస్తున్నారు. వారసుడు కూడా ఇదే కోవలోకి వచ్చే సినిమా. ఎన్నో సినిమాల్లో చూసిన కథ ఇది. వేల లక్షల కోట్లు ఉన్న కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి.. కానీ కలిసి ఉంటేనే కుటుంబం అనేది వంశీ పైడిపల్లి చెప్పాలనుకున్న లైన్. దాన్ని ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు కానీ.. అందులో సక్సెస్ అయింది మాత్రం కొంతవరకే. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగింది. జయసుధ, విజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

అమ్మ పాట చాలా బాగుంది.. విజువలైజేషన్ అద్భుతం.. యోగి బాబు కామెడీ బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ మొదటి అరగంట సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా చైర్మన్ ఓటింగ్ సీన్ అదిరిపోయింది. ఎమోషన్స్ బాగానే పండినా.. ఎన్నో సినిమాలు మన బుర్రలో మేమున్నామని గుర్తు చేస్తుంటాయి. అదే వారసుడుకు మైనస్ అయింది.

నటీనటులు.. విజయ్‌ని చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో చూడడం బాగుంది. తన ఎనర్జీ ప్లస్ స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ కాదు.. అతిథిలా ఉంది. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళింది.. పాటల కోసం హీరోయిన్ అన్నట్లుంది. శ్రీకాంత్, శరత్ కుమార్, జయసుధ అందరూ పాత్రలకు న్యాయం చేశారు. ప్రకాశ్ రాజ్ విలనిజం రొటీన్‌గా అనిపిస్తుంది.

టెక్నికల్ గా.. థమన్ సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. రంజితమే సాంగ్‌కు థియేటర్ ఊగిపోయింది. పళనీ కార్తిక్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమా రిచ్ నెస్ పెంచేసింది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ మాత్రం వీక్. ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. వంశీ పైడిపల్లి మాత్రం మరోసారి రొటీన్ కథనే నమ్ముకున్నాడు. ఇలాంటి కథ చెప్పాలనుకున్నపుడు స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉండాలి. అక్కడే మిస్ ఫైర్ అయింది వారసుడు. స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. రొటీన్ ఫ్యామిలీ డ్రామా అనిపిస్తుంది. ప్రేక్ష‌కులు ఏ మేర‌కు ఆద‌రిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement