Thursday, March 28, 2024

Story : దూసుకుపోతున్న టాటా గ్రూప్.. ఎయిరిండియాలో విలీనం కానున్న విస్తారా.. సంయుక్త ప్ర‌క‌ట‌న‌

టాటా గ్రూప్ కి చెందిన ఎయిరిండియాలో విలీనం కానుంది సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ పెట్టుబ‌డులు ఉన్న విస్తారా. ఈ మేర‌కు సంయుక్తంగా ఈ సంస్థ‌లు ప్ర‌క‌ట‌న కూడా చేశాయి.కాగా ఈ విలీన ప్రక్రియ 2024 మార్చి కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎప్పటినుంచో విలీనం గురించి ఈ రెండింటి మధ్య చర్చలు జరుగుతున్నాయి. విస్తారా, ఎయిరిండియా విలీనంకు సంబంధించి.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (SIA) కూడా ప్రకటన చేసింది. విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేసిన తర్వాత.. ఎయిరిండియాలో తమకు 25 శాతం వాటా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం విస్తారాలో టాటా గ్రూప్‌కు 51 శాతం వాటా ఉండగా.. మిగతా 49 శాతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌ది. ముందు జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రూ.2058.5 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. విస్తారా .. ఎయిరిండియాలో విలీనం పూర్తయిన తర్వాత.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌కు ఎయిరిండియాలో 25.1 శాతం వాటా కలిగి ఉండనున్నట్లు ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది.ఈ విలీన ప్రకటన తర్వాత టాటా గ్రూప్ కూడా ప్రెస్ రిలీజ్ చేసింది.

విలీనం పూర్తయితే ఎయిరిండియా.. 218 విమానాలతో భారత అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరిస్తుందని తెలిపింది. ఇక దేశీయంగా చూస్తే రెండో స్థానంలో ఉండనున్నట్లు వివరించింది. టాటా గ్రూప్.. రూ.18 వేల కోట్లతో భారత ప్రభుత్వం నుంచి ఈ ఏడాది ప్రారంభంలో ఎయిరిండియాను తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే.సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, ఎయిరిండియా కలిసి విస్తారాను ప్రారంభించాయి. ప్రస్తుతం 43 జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతోంది. రోజుకు సగటున 260 కంటే ఎక్కువ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు సమాచారం. మొత్తంగా ఇందులో 4700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇక మరో విశేషం ఏంటంటే.. టాటా గ్రూప్‌కు ప్రస్తుతం నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా ఎయిర్‌‌లైన్స్ టాటాలవే.

- Advertisement -

ఇవన్నింటినీ కూడా ఒకే గూటికి తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తోంది టాటా సన్స్. ఇప్పటికే ఎయిర్ ఏషియా ఇండియాలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు కొంత వాటాలుండగా.. దీనిని పూర్తిగా టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో ఎయిర్ ఏషియా ఇండియా నుంచి మలేసియా ఎయిర్‌లైన్స్ పూర్తిగా వైదొలిగినట్లే. దీంతో ఇది కూడా పూర్తి భారత విమానయాన సంస్థగా అవతరించనుంది.మరోవైపు టాటాలు ఇటీవలి కాలంలో మరింత దూకుడు పెంచారు. పలు రంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. టాటా గ్రూప్ ఇటీవల.. బ్యూటీ టెక్ ప్రొడక్ట్స్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు, దేశవ్యాప్తంగా స్టోర్లను తెరుస్తున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement