Wednesday, April 24, 2024

UP Elections: యూపీలో చరిత్ర తిరగరాసిన బీజేపీ.. వరుసగా రెండోసారి అధికారం!

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని బట్టి కాషాయ పార్టీ 273కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ 116 చోట్ల, బీఎస్పీ 5, కాంగ్రెస్ 4, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు చెసుకుంటున్నారు. 1985 తర్వాత యూపీలో వరుసగా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. కానీ, ఈ సంప్రదాయానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్తి పలికారు. 37 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఓ పార్టీ అధికారంలోకి రానుండడం గమనార్హం. గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తన సమీప సమాజ్ వాదీ అభ్యర్థిపై 12,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

యూపీలో బీజేపీకి పరాజంయ తగులుతుందని అనుకున్న ప్రాంతాలలో కూడా ఆపార్టీ మెజారిటీతో దూసుకుపోతుంది. రైతుల ఉద్యమ ప్రభావం భావించిన పశ్చిమ యూపీ ప్రాంతంలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా యూపీలో 403 స్థానాలకు గాను బిజెపి ప్రస్తుతం దాదాపు 274 స్థానాలకుపైగా లీడ్ సాధించగా 300 స్థానాలు బీజేపీ ఖాతాలో పడతాయని ప్రస్తుతం కొనసాగుతున్న ఫలితాల ట్రెండ్ ను బట్టి అంచనా వేస్తున్నారు.

2017లో బీజేపీ సొంతంగా 312 సీట్లు గెలుచుకోగా, ఎన్డీఏ సంఖ్య 325 స్థానాల్లో గెలిచింది. ఎస్పీ 47, బీఎస్పీ 19, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఈసారి అప్నా దళ్ (సోనేలాల్), నిషాద్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement