Friday, May 3, 2024

ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌దే విజ‌యం.. అమెరికా కీల‌క ప్ర‌క‌ట‌న‌..

ఉక్రెయిన్‌పై ర‌ష్యా మొద‌లెట్టిన యుద్దం ప‌దో రోజు భీక‌రంగా సాగుతోంది. రెండో విడ‌త చ‌ర్చ‌ల్లో భాగంగా ఉక్రెయిన్‌కు చెందిన ప‌లు న‌గ‌రాల్లోని విదేశీయుల‌ను సుర‌క్షితంగా యుద్ధ భూమి నుంచి త‌ర‌లించేందుకు ఐదున్న‌ర గంట‌ల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ను పాటించిన ర‌ష్యా.. కాల్పుల విర‌మ‌ణ గ‌డువు ముగిసిన వెంట‌నే కాసేప‌టి క్రితం మ‌ళ్లీ యుద్దం మొదలెట్టింది. ఉక్రెయిన్ త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చేదాకా యుద్ధాన్ని ఆపేదే లేదంటూ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ప్ర‌క‌టించిన కాసేప‌టికే ఈ యుద్ధంపై అగ్రరాజ్యం అమెరికా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. యుద్ధంలో విజ‌యం ఉక్రెయిన్‌నే వ‌రిస్తుంద‌ని అమెరికా చేసిన ప్ర‌క‌ట‌న మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేసేదిగానే ఉంది. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించాలంటూనే.. ఉక్రెయిన్‌పై దాడులు స‌రికాదంటూ ర‌ష్యాకు చెబుతూ వ‌స్తున్న అమెరికా.. తాజాగా ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

శ‌నివారం ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్ర‌సంగం తర్వాత అమెరికా ప్ర‌తినిది ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలో అంతిమ విజ‌యం మాత్రం ఉక్రెయిన్‌దేన‌ని అమెరికా ప్ర‌తినిధి పేర్కొన్నారు. ఇప్ప‌టికే ప‌లు దేశాల నుంచి సాయం అందుకుంటూ ర‌ష్యా దాడుల‌ను తిప్పికొడుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో గెలిచి తీరాలంటే..అమెరికా లాంటి దేశాలు ఆ దేశానికి స‌హ‌క‌రించ‌క త‌ప్ప‌దు. ఈ భావ‌న‌తోనే అమెరికా ఈ ప్ర‌క‌ట‌న చేసిందా? అన్న దిశ‌గా ఇప్పుడు స‌రికొత్త భ‌యాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement