Monday, April 29, 2024

Big Story | కారుమబ్బుల్లేవ్​, చిటపట చినుకుల్లేవ్.. వానల కోసం రైతుల ఎదురుచూపు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వర్షాకాలం సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు తొలకరి చినుకుల జాడలు కనిపించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పట్లో వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించకపోవడంతో కుదేలైపోతున్నారు. ప్రస్తుతం రోహిణి కార్తె ముగిసి మృగశిరకార్తె ప్రారంభమైంది. ఈ కార్తె నుంచి వర్షాలు కురవాలి. వర్షాలు కురవాల్సిన ఈ సమయంలో ఎండకాలంలో మాదిరిగా అన్ని జిల్లాల్లో 44 డిగ్రీల ఎండలు కాస్తూ వడగాలులు వీస్తున్నాయి. ఈసారి వానాకాలం సాగు కోసం రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు.

సాధారణంగా ఆలస్యమైనా జూన్‌ 6నాటికి తొలకరి చినుకులు పలుకరించాల్సి ఉన్నా ఆ ఊసే లేదు. దీంతో అదను దాటిపోతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగు కోసం రైతులు దుక్కిదున్ని సిధ్దం చేసేందుకు, విత్తనాలను ముందే కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవడంతో ఇప్పటికే ఎకరాకు రూ.10వేలదాకా ఖర్చు అయింది. అయినప్పటికీ తొలకరి పలకరించకపోవడంతో సాగుకు చేసిన ప్రయత్నాలు అన్నీ వృథా అవనున్నాయని రైతులు వాపోతున్నారు.

గతేడాది జూన్‌లో ఈపాటికే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువే నమోదైంది. ఈసారి ఖరీఫ్‌ 2023లో కనీసం 55లక్షల ఎకరాల్లో వరి, 60లక్షల ఎకరాల్లో పత్తితోపాటు మరో 30లక్షల ఎకరాల్లో మిర్చి, పసుపు, సోయా, కంది, పెసర తదితర పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ఖరీఫ్‌ యాక్షన్‌ప్లాన్‌-2023లో పేర్కొంది. తెలంగాణలో 1.36కోట్ల వ్యవసాయ భూమి ఉంటే అందులో దాదాపు 55శాతం వర్షాధారిత పంటలే సాగవుతాయి. ఇందులో 65లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అంచనా. మిగతాది తీసుకుంటే దాదాపు 50లక్షల ఎకరాల్లో వరిసాగవుతుంటుంది. వర్షాకాలం ప్రారంభమైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. -60 మి.మీ నుంచి -96 మి.మీల లోటు వర్షం పాతం నమోదయింది.

ఏటా మాదారిగానే ఈఏడాది కూడా నల్లరేగడి నేలలున్న ప్రాంతాలతోపాటు పలు చోట్ల రైతులు పత్తి విత్తనాలను నాటారు. ప్రతి ఏటా విత్తనాలు నాటిన కనీసం వారం రోజుల లోపైనా వర్షాలు కురిసేవి. అయితే ఈసారి విత్తనాలు భూమిలో పెట్టి 10 రోజులు గడుస్తున్నా వర్షం చినుకుజాడ లేకపోవడంతో విత్తనం భూమిలోనే ఒట్టిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి రెండు ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటామని, ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని విత్తనాలను భూమిలో పాతి తే చినుకు నేలరాలకపోవడంతో పెట్టిన పెట్టుబడి అంతా వృథా అవుతుందని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 13లక్షల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలను నాటినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు వర్షాలు కురుస్తాయని, వర్షం కురిశాక విత్తనం కోసం పరుగెడితే విత్తనాలు దొరక్కపోగా కల్తీ విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉందని భావించిన రైతులు పెద్ద ఎత్తున పత్తి, వరి విత్తనాలను ముందే కొనుగోలు చేసిపెట్టుకున్నారు. వర్షాలు పడగానే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 20 దాకా వర్షాభావ పరిస్థితులే కొనసాగనున్నాయని, జూన్‌ 20 నుంచి జులై 10 మధ్యన రాష్ట్రంలో రుతుపవన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. తొలకరి ప్రారంభమయ్యాకే వర్షం కురిశాకే విత్తనాలు నాటాలని చెప్పినా కొన్నిచోట్ల రైతులు వినిపించుకోలేదని వ్యవసాయశాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసి విత్తనం మెలకెత్తేందుకు అవసరమయ్యేంత తేమ భూమిలో ఉన్నపుడే విత్తనాలు నాటాలని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. తేమ లేకున్నా విత్తనాలు నాటితే చాలా వరకు వ ట్టిపోయి పోగుంటలు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement