Tuesday, October 8, 2024

Jammu Kashmir : ఇద్దరు ఎల్‌ఈటీ మిలిటెంట్లు అరెస్ట్‌

ఇద్దరు మిలిటెంట్లను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అరెస్ట్ చేశాయి. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో భద్రతా దళాలు లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను ఈరోజు అరెస్టు చేశాయి. ఫ్రెస్టిహార్‌ క్రీరి గ్రామంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిర్ధిష్ట సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా బలగాలతో కలిసి ఫ్రెస్టిహార్ వారిపోరా క్రాసింగ్ వద్ద మొబైల్ వెహికల్ చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేశాయి. అటువైపుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. భద్రతా బలగాలను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు వారిని చాకచక్యంగా పట్టుకున్నాయని పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇద్దరు ఎల్‌ఈటీకి చెందిన మిలిటెంట్లు అని పేర్కొన్నారు. సోదా చేయగా రెండు చైనీస్‌ పిస్టల్స్‌, రెండు మ్యాగజైన్లు, 15 పిస్టల్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులిద్దరు ఫ్రెస్టిహార్‌ క్రీరికి చెందిన సుహైల్‌ గుల్జార్‌, హుడిపోరా రఫియాబాద్‌కు చెందిన వసీమ్‌ అహ్మద్‌గా గుర్తించారు. వారిపై పలు సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement