Thursday, April 25, 2024

ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ పై వేటు..పెద్ద మొత్తంలో పరిహారం

44బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలో అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విటర్‌ను నియంత్రణలోకి తీసుకొని దాని టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. ఆ తర్వాత ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. పక్షికి విముక్తి లభించింది అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. ట్విట్టర్ లోగోలో నీలి రంగు పక్షి ఉండటం గమనార్హం. ట్విట్టర్ కొనుగోలు డీల్ పూర్తి చేసిన మస్క్ గురువారం దానికి కొత్త యజమాని అయ్యారు. అయితే తనను తప్పుదారి పట్టించాడని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోసం తాను వివరించిన ఉన్నతమైన ఆశయాలను ఎలా సాధించాలనే సరైన స్పష్టత లేదంటూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు.

సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్‌ సీన్ హెడ్గెట్‌లపై మస్క్ వేటు వేశారు. కాగా ట్విట్టర్ సీఈవోగా ఇంత కాలం కీలక బాధ్యతలు చూసిన భారతీయుడు పరాగ్ అగర్వాల్ కు ఇప్పుడు పెద్ద మొత్తం పరిహారంగా ముట్టనుంది. 2021 నవంబర్ లో ట్విట్టర్ సీఈవోగా అగర్వాల్ నియమితులయ్యారు. అప్పటి వరకు ఈ బాధ్యతలు చూసిన జాక్ డోర్సే అగర్వాల్ ను తన వారసుడిగా ప్రమోట్ చేశారు. నియమితులైన 12 నెలల్లోపే తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.344 కోట్లు. అయినప్పటికీ పరాగ్ అగర్వాల్ కోణం నుంచి చూస్తే ఈ పరిహారం పెద్ద మొత్తం కాదు. ఎందుకంటే 2021కి పరాగ్ అగర్వాల్ అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు). అంటే కేవలం ఓ ఏడాదికి సరిపడా వేతనం పరిహారం రూపంలో రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement