Sunday, May 19, 2024

పోటీపై.. పోటాపోటీ ! నేనంటే నేనే.. అంటున్న రేఖా నాయ‌క్,జాన్స‌న్

ఉమ్మడి ఆదిలాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో – ఎమ్మెల్యేగా పోటి చేయడంపై అభ్యర్థులు ఇప్పటి నుంచే పోటాపోటిగా మాట్లాడుతున్నారు. తానంటే తానే పోటీలో ఉంటానంటూ ఒకరిపై ఒకరు సెటైర్లు విసురుకుంటున్నారు. తాజాగా ఖానాపూర్‌ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే ఉంటానంటూ.. జాన్సన్‌ వేరే దారి చూసుకుంటాడని ఎమ్మెల్యే రేఖానాయక్‌ చెప్పడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా చాలా రోజుల వ్యవధి ఉండటం, ఇప్పుడే అభ్యర్థిత్వంపై పోటాపోటిగా వ్యాఖ్యలుచేసుకోవడం ప్రాధాన్యతను చోటు చేసుకుంటుంది. తాజా రంజాన్‌ వేడుకల్లో ఖానాపూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్‌ , నియోజక వర్గ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి అని ప్రచారం జరుగుతున్న జాన్సన్‌ నాయక్‌లు ఎదురుపడ్డారు. ఈసందర్బంగా అలైబలై చేసుకున్న తర్వాత రేఖ మాట్లాడుతూ ఈసారి ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా తానే ఉంటానని, జాన్సన్‌ నాయక్‌ వేరే ఏదైన చూసుకుంటాడని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

కెటిఆర్‌కు అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు చెపుతున్న జాన్సన్‌నాయక్‌ ను పట్టుకుని రేఖానాయక్‌ అంతమాట అనడం ఏంటని సొంత పార్టీలోనే ప్రశ్నల పర్వం తలెత్తుతుంది. ఏదైన ఉంటే అంతర్గతంగా చూసుకోవాలి కానీ ఇలా బాహాటంగా ఎమ్మెల్యేగా తానే ఉంటాను అం టూ ఎదుటివారు ఏదైన వేరే చూసుకుంటారు అని అనడం ఆనోటా ఈనోటా అధిష్టానం దృష్టికి వెళ్లడంతోపాటు, పార్టీ వర్గాల్లో కొందరు కెటిఆర్‌, ఇతర ఉన్నత శ్రేణి నాయకులకు విషయం తెలియజేసినట్లు తెలిసింది. మొత్తంగా తాజాగా ఖానాపూర్‌ నియోజక వర్గం వ్యవహారం మళ్లి అధిష్టానం దృష్టికి వెళ్లడం గమనార్హం. సరిగా నెలరోజుల క్రితం రాష్ట్రస్థాయి బిఆర్‌ఎస్‌ సమావేశంలో కెసీఆర్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ , నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ తోపాటు వరంగల్‌ జిల్లాలోని ఒకటి రెండు నియోజక వర్గాల్లో దళిత బంధు తదితర స్కీంల్లో స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ పరువును అప్రతిష్టపాలు చేశారన్నట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. ఇదిలా ఉంటే, తాజాగా కెసీఆర్‌ నోటి నుంచి వచ్చిన ఖానాపూర్‌ నియోజక వర్గం వ్యవహారమే మళ్లి తెరపైకి రావడం వివాదాలకు దారితీసే అవకాశాలున్నట్లు రాజకీయ నిపుణుల అభిప్రాయం.

రెండుసార్లు ఎమ్మెల్యేగా..
ఖానాపూర్‌ నియోజక వర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేఖాశ్యాంనాయక్‌ మూడో సారి కూడ ఎమ్మెల్యే బరిలో దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు తన వర్గానికి చెందిన నేతలతో ప్రతినిత్యం సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజా అవసరాలను తీర్చే దిశగా తనదైన శైలిలో ముందుకెళుతున్నట్లు పార్టీ వర్గీయులు చెపుతున్నారు. వరుసగా రెండుసార్లు కెసీఆర్‌ బొమ్మతోనే గెలిచారనే ముద్ర ఉన్నట్లు సొంత నియోజక వర్గంలోనే ఓ ప్రచారం ఉంది. అయితే ఈసారి కెసీఆర్‌ ముద్రతో గెలిచే పరిస్థితులు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు ఉన్నందున స్వయంగా ప్రజల్లోకి వెళ్లాలనే భావనతోనే రేఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గడిచిన నాలుగు సంవత్సరాల్లో అభివృద్ది పనులపై కూడ ఆమె స్వయంగా దృష్టిసారించారనే వాదనలు ఉన్నాయి.

దీంతో పాటు గ్రామాల సందర్శన , పండుగలు , ఇతర సంతోష వేడుకలకు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లడం ,వారి కనీస అవసరాలను తీర్చడం లాంటివి కూడ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈసారి ఎన్నిక ల్లో తనకు టికెట్‌ వచ్చినప్పటికి గెలుపోటములు అనే విషయాలు చాలా టఫ్‌గా ఉంటాయనే వాదనలు ఉండటంతో రేఖ ఆ మేరకు అన్ని రకాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసుకుంటూ ముందుకుపోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరో ఏడు , ఎనిమిది నెలల్లో ఎన్నికలు వస్తాయనే ప్రచారం గట్టిగా జరుగుతుండటంతో టికెట్టు వస్తుందా రాదా అనే దానిపై కూడ రేఖ తన సమీప నేతలతో బేరీజు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రానున్న ఎన్నికల్లో తానే పోటీలో ఉంటాననే సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు , గెలుపుకూడ తమవెంటే ఉంటుందనే బ లమైన నమ్మకంతో రేఖ ముందుకెళుతున్నట్లు తెలుస్తుంది.

కెటీఆర్‌కు అత్యంత సమీప వ్యక్తి
జాన్సన్‌ నాయక్‌ .. ఈపేరు గడిచి న నాలుగైదు సంవత్సరాలుగా ఖానాపూర్‌లో అత్యంత ప్రచారానికి నోచుకుటుంది. ఎందుకు ? అంటారా .. ఈయన కెటీఆర్‌కు అత్యంత సమీప వ్యక్తి అని పార్టీ వర్గాలు ప్రతీనిత్యం చర్చించుకుంటాయి. ఓ సమావేశంలో కెటీఆర్‌ జాన్సన్‌ నాయక్‌ పై మాట్లాడుతూ ..” జాన్సన్‌ నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం.ఒకరిపై ఒకరం ఎంతో నమ్మకంగా ఉంటాం. తనకు సమస్య వచ్చినప్పుడు నేను, నాకు సమస్య వచ్చినప్పుడు జాన్సన్‌ అన్నివిధాలుగా సహకరించేవాడు. జాన్సన్‌కు సంబంధించిన ఓ రికమండేషన్‌ విషయంలో కులం గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, అప్పటివరకు నాకు జాన్సన్‌ ఏకులానికి చెందినవాడో తెలియదు. అంటే మా ఇద్దరి మధ్య స్నేహం ఎంతటి బలమైనదో తెలుసుకోవచ్చు. ఆతర్వాత రికమండేషన్‌ కోసమే నేను జాన్సన్‌ను కులమడిగి పనిచేసి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ” అంటూ కెటీఆర్‌ జాన్సన్‌ నాయక్‌తో తనకున్న స్నేహ బంధాన్ని విడమర్చి చెప్పడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

చిన్నప్పటి నుంచి స్నేహబంధం కొనసాగిస్తున్నప్పటికి జాన్సన్‌ ఏ కులానికి చెందినవాడో కూడ తెలియదంటే కెటీఆర్‌ , జాన్సన్‌లు ఎంత ప్రాణ స్నేహితులో వేరేవిధంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నమ్మకంతోనే రానున్న ఎన్నికల్లో జాన్సన్‌ నాయక్‌ తనకు టికెట్‌ వస్తుందనే ఆశతో ఉన్నట్లుతెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఖానాపూర్‌ నియోజక వర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాశాలుంటాయని మాత్రమే జాన్సన్‌ నాయక్‌ చెపుతున్నారు. అధిష్టానం అభిప్రాయం మార్చుకుని టికెట్టు వేరే ఎవరికి ఇచ్చినా, తాను మాత్రం ఓ కుటుంబ సభ్యునిగా బిఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం పాటుపడుతానని చెప్పడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. తాజాగా రంజాన్‌ వేడుకల్లో ఎమ్మెల్యే రేఖ బరిలో తానే ఉంటానని, జాన్సన్‌ ఏదైన వేరే చూసుకుంటాడని చెప్పడం .. జాన్సన్‌ మాత్రం పార్టీ టికెట్టు ఎవరికిచ్చినప్పటికి కుటుంబ సభ్యునిగా పనిచేస్తానని చెప్పడం లాంటి అంశాలు అధిష్టానం భూతద్దంలో పెట్టి పరిశీలిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement