Tuesday, May 21, 2024

సిట్ బోనులో టి ఎస్ పి ఎస్ సి ఛైర్మ‌న్ ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పేపర్‌ లీకేజీ కేసులో విచారణ మరింత లోతుగా సాగుతోంది. ఒకవైపు నిందుతులను విచారిస్తున్న సిట్‌.. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ పెద్దలను కూడా విచారించే పనిలో పడింది. ఈమేరకు ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌, టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సభ్యులు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేయడం, వారిని విచా రించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డిని కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్లు సమాచారం. చైర్మన్‌ నుంచి సేకరించే సమాచారం పేపర్‌ లీకేజీ కేసులో కీలకం కానుండడంతో చైర్మన్‌ను ప్రశించాలని సిట్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల భద్రత, కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌, కంప్యూటర్‌ తదితర అంశాలపై ప్రశ్నలడిగే వీలుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్‌ లీకేజీ నిందితులు ప్రవీణ్‌, రమేష్‌లు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి శనివారం రోజు సెక్రటరీ అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డిని సిట్‌ అధికారులు విచారించారు. వారిద్దరూ ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చైర్మన్‌ను ప్రశ్నించి కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించాలని సిట్‌ భావిస్తోంది. అయితే ఇందుకోసం న్యాయనిపుణుల సలహాను సిట్‌ తీసు కుంటోంది. ఆయనను సిట్‌ కార్యాలయానికి రప్పించకుండా ఆయన వద్దకే అధికారులు వెళ్లి విచారించాలా? లేకుంటే నోటీసులిచ్చి సిట్‌ కార్యాలయంలో ప్రశ్నించాలా? అని సిట్‌ భావిస్తోంది. అయితే కమిషన్‌ చైర్మన్‌ ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడే వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకునే అవకాశమూ ఉంది.

ఇదిలా ఉంటే ప్రశ్నపత్రాలు రూపొందించాక వాటి భద్రత బాధ్యత చైర్మన్‌, కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌ అధికారిని శంకరలక్ష్మీ ఆధ్వర్యంలోనే ఉంటుందని సిట్‌ అధికారుల విచారణలో అనితా రామచంద్రన్‌ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ఆధీనంలో మాత్రమే పేపర్‌ లాకర్‌, పాస్‌వర్డ్‌ అంశాలు ఉంటాయని వివరించినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఒకరిద్దరికి మాత్రమే తెలిసే భద్రతా పరమైన అంశాల సమాచారం, వివరాలు నిందితుల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే కోణంలో చైర్మన్‌ను అడిగి తెలుసుకునేందుకు సిట్‌ సన్నద్ధమవుతోంది. తన రూమ్‌కి తరచూ ఎవరెవరూ వస్తుండేవారు? కమిషన్‌ ఉద్యోగులు, నిందితుల సమాచారాన్ని సిట్‌ అధికారులు చైర్మన్‌ నుంచి సేకరించనున్నారు. నేడు లేదా రేపు నేరుగా ఆయనకే నోటీసులు ఇచ్చి కలిసే అవకాశమూ ఉన్నట్లుగా సమాచారం.

నిందితులను విచారించడంలో సీట్‌ వేగం పెంచింది. షమీమ్‌, రమేష్‌, సురేష్‌ల కస్టడీ ముగిసింది. వీరి ఐదు రోజుల కస్టడీ విచారణలో సిట్‌ కీలక వివరాలను రాబట్టింది. అయితే పేపర్‌ లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన ప్రశాంత్‌, రాజేందర్‌, తిరుపతయ్యను కస్టడీ కోరుతూ సిట్‌ అధికారులు ఇప్పటికే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెలువరించనున్నట్లు తెలిసింది. పేపర్‌ లీకేజీలో మరో నిందితురాలిగా ఉన్న రేణుక దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement