Saturday, May 4, 2024

మంత్రి కేటీఆర్‌ కుమారుడిపై కామెంట్స్‌.. టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య‌ మాటల యుద్ధం..

తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఈ మ‌ధ్య‌కాలంలోనే బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్నగా పేరుగాంచిన‌ చింతపండు నవీన్‌కుమార్‌ సోషల్‌మీడియాలో మంత్రి కేటీఆర్ కుమారుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులు శుక్రవారం రాత్రి యూట్యూబ్ చానెల్‌ నిర్వహిస్తున్న నవీన్‌కుమార్‌ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, ఈ దాడికి సంబంధించి నవీన్‌కుమార్‌ నుంచి త‌మ‌కు ఫిర్యాదు అందిందని, కేసు దర్యాప్తులో ఉందన్నారు మల్కాజ్‌గిరి ఏపీసీ. దాడి చేసిన వారిని గుర్తించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని ఏసీపీ తెలిపారు. అయితే ఈ దాడిని ఓ పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌. తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన పోకిరీలు చేసిన దాడిని ఖండిస్తున్నా. బీజేపీపై, దాని కేడర్‌పై జరుగుతున్న ప్రతి దాడి సీఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌లో అధికారం కోల్పోతున్నామ‌నే భయం పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ పోలీసులు నిందితులను అరెస్టు చేయాలి’’ అని ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.

దీనికి ముందు మంత్రి కేటీఆర్ పిల్ల‌ల‌ను రాజ‌కీయ స‌మ‌స్య‌ల్లోకి లాగుతున్నార‌ని, బాడీ షేమింగ్ చేస్తూ వికృతానందం పొందుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “శ్రీ @JPNadda జీ, మీరు తెలంగాణలోని బీజేపీ నాయకులకు నేర్పేది ఇదేనా? బీజేపీ నాయ‌కులు అగ్లీ పొలిటిక‌ల్ కామెంట్స్ ద్వారా నా కొడుకును రాజ‌కీయాల్లోకి లాగడం, బాడీ షేమింగ్ చేయ‌డం సంస్కారమా? అమిత్ షా, మోడీ ఫ్యామిలీపై మేము అదే విధంగా స్పందించాలని మీరు కోరుకుంటున్నారా? అని డిసెంబర్ 24న ట్వీట్ చేశారు. వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని దుర్వినియోగం చేయడం.. సోషల్ మీడియా జర్నలిజం ముసుగులో బురదజల్లడం.. కొంద‌రికి అల‌వాటుగా మారిందని మరో ట్వీట్‌లో మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement