Friday, April 26, 2024

సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ లేఖ

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన  భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలన్నారు. పంటల బీమా అమలు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని, తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వరద పాలైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తోందన్నారు.  ఉత్తర తెలంగాణ జిల్లాలలో పంట నష్టం తీవ్రంగా ఉంది. పంట నీట మునిగి, పెట్టిన పెట్టుబడి సర్వం కోల్పోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని చెప్పారు.  విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పంట న‌ష్టం అంచ‌నా వేయించే వారని, టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఎన్నడూ చేపట్టిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాలను సైతం అటకెక్కించారని ఆరోపించారు.  కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్ధేశంతో పథకానికి మంగళంపాడారని ఆరోపించారు.

జాతీయ వ్యవసాయ బీమా సంస్థ రాష్ట్రంలో వర్ష బీమా – 2021 పేరుతో అమలు చేస్తోన్న పథకంలో కేవలం ఏడు పంటలకు మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు.  కూలీ రేట్లు పెరగడంతో ఉత్పాదక ఖర్చులు 20 శాతానికి పైగా అదనంగా పెరిగాయని చెప్పారు.  రూ. లక్ష రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో మీరిచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు. రుణం మాఫీ కాకపోవడం, మాఫీ అవుతుందని రైతులు బాకీ చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్త అప్పులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం 24 గంటలూ హుజూరాబాద్ ఎన్నికలలో గెలుపు కోసం ఎత్తులు జిత్తులు వేసుకునే పనిలో మునిగిపోయారని విమర్శించారు.  మూడు వేల కోట్లు ఖర్చు చేసైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలవాలన్న పట్టుదలతో ఉన్న మీకు… రైతులకు వెయ్యి కోట్లు సాయం చేయాలన్న ధ్యాస లేకపోడవం శోచనీయం అని రేవంత్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement