Friday, May 3, 2024

Big Story: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దూకుడు.. మరోసారి సినీ ప్రముఖులను ప్రశ్నించే చాన్స్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమాయత్తం అమవుతోంది. ఈ కేసులో ఎక్సైజ్‌ శాఖ అధికారులు మంగళవారం హైకోర్టులో మెమాెె దాఖలు చేశారు. ఈడీ అధికారులు కోరిన వివరాలు ఇచ్చామని ఎక్సైజ్‌ శాఖ దాఖలు చేసింది.. మెమోలో పేర్కొంది. డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖ అధికారులు తమకు వివరాలు ఇవ్వడం లేదంటూ ఈడీ ఈనెల 11న హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సరైన వివరాలు ఇవ్వడం లేదని ఈడీ తరఫు న్యాయవాది పిటీషన్‌లో పేర్కొన్నారు. 2017వ సంవత్సరంలో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును ఎక్సైజ్‌ అధికారులు దర్యాప్తు చేశారని ఈ కేసులో దాదాపు 62 మందిని ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు ఆధారాలు కూడా సేకరించారని ఈడీ పేర్కొంది. ఈ సందర్భంగా పలువురు అనుమానితుల నుంచి వారి రక్తం, గోర్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపించారని పేర్కొన్నారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు వచ్చినా వాటిని ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో ఈడీ న్యాయవాది పేర్కొన్నారు. డిజిటల్‌ రికార్డులు, కాల్‌డేటా ఇతర కీలక దృవపత్రాలు ఉన్నప్పటికీ వాటిని అందజేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. దీంతో ఈ కేసు తాత్సారం చేస్తున్నట్టుగా కనిపిస్తోందని ఈడీ తమ పిటీషన్‌లో అనుమానం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని ఈడీ అధికారులు హైకోర్టుకు తెలిపారు. కేవలం 12 ఎఫ్‌ఐఆర్‌లు, నేరాభియోగ పత్రాలు మాత్రమే తమకు ఇచ్చారని మిగతా వాటిని అడిగినా ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈడీ అధికారులు అడిగిన వివరాలన్నింటినీ అందజేసి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశించినా ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ తరఫు న్యాయవాది లేవనెత్తిన అంశాలపై స్పందించిన హైకోర్టు నెల రోజుల్లోపు (మార్చి 3వ తేదీలోపు) ఈడీకి పూర్తి వివరాలు ఇవ్వాలని గడువు విధించినా ఎక్సైజ్‌ శాఖ అధికారుల నుంచి ఎలాంటి పత్రాలు రాలేదని ఈడీ అధికారులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఎక్సైజ్‌ శాఖ తరఫున మంగళవారం రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టులో మెమో దాఖలు చేశారు. ఈడీ అధికారులు అడిగిన వివరాలన్నింటినీ అందజేశామని కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారులకు వారు అడిగిన సమాచారం పూర్తిగా చేరితే దర్యాప్తు మరోసారి ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇప్పటికే సినీ రంగానికి చెందిన 12 మందికి గత ఏడాది ఆగస్టు మాసంలో నోటీసులు జారీ చేసి ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ 12 మంది వ్యక్తిగత బ్యాంకు ఖాతాలతో పాటు వారు నిర్వహించే సంస్థల ఖాతాల వివరాలను ఈడీ అధికారులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇక దూకుడే..
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఎక్సైజ్‌ శాఖ పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఇక కేసులో మరింత దూకుడుగా వెళ్లాలని ఈడీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు ఈ నివేదికలను ఈ రంగంలోని నిపుణులకు పంపించి పూర్తి సమాచారాన్ని రాబట్టాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా డ్రగ్స్‌ కేసులో 12 మందిని మాత్రమే విచారించిన ఈడీ వచ్చే వారం, పది రోజుల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 50 మందికి నోటీసులు ఇచ్చి కూపీ లాగే అవకాశం కనిపిస్తోంది. ఈ డ్రగ్స్‌ కేసులో అప్పటి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా పని చేసిన సీనియర్‌ పోలీస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ బృందం అనుమానితులను నాంపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన 62 మందిని ప్రశ్నించి అందులో కొంత మంది నుంచి రక్తం, గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు.

వీటిని పరీక్ష కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపి నివేదిక కూడా తెప్పించారు. ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఈ కేసుకు సంబంధించి ఈడీ, హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈడీ రంగప్రవేశం చేసి గత ఏడాది ఆగస్టులో 12 మందిని బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టింది. కాగా హైకోర్టు ఆదేశంతో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. మిగిలిన 50 మంది అనుమానితుల బ్యాంకు ఖాతాల వివరాలను, లావాదేవీల సమాచారాన్ని తెప్పించే పనిలో ఈడీ ఉన్నట్టు చెబుతున్నారు. ఎక్సైజ్‌ శాఖ అందించే డిజిటల్‌ రికార్డులు, కాల్‌డేటా సమాచారాన్ని సేకరించడం ద్వారా దర్యాప్తును ముమ్మరం చేయాలని ఈడీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కాల్‌డేటా వివరాలతో దర్యాప్తు మరింత కీలకం కానున్నదని ఇందులో లభించే వివరాల ఆధారంగా ఈడీ అధికారులు అవసరమైతే మరోసారి సినీ రంగానికి ప్రముఖులను ప్రశ్నించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement