Thursday, May 2, 2024

High Court: పిల్లలు కనాలా, వద్దా? అనేది కోర్టులు నిర్ణ‌యించ‌లేవు.. అది పూర్తిగా మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌!

పిల్లలు కనడమా? వద్దా! అనేది మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం అని కేరళ హైకోర్టు పేర్కొంది. హెల్త్​ ఇష్యూస్​ కారణంగా 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ 23 ఏళ్ల యువతి హైకోర్టును ఆశ్రయించగా జరిపిన వాదనల్లో ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ యువతి ఎంబీఏ విద్యార్థిని కాగా, తన సహ విద్యార్థితో శారీరక సంబంధం కారణంగా గర్భం దాల్చింది. తాను గర్భవతినన్న విషయం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా వెల్లడైందని, పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ తో బాధపడుతున్నందున గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని ఆమె కోర్టును కోరింది.

అంతేకాకుండా తన భాగస్వామి పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయాడని, ఇప్పుడు ఈ గర్భంతో ఎంతో ఆందోళనకు గురవుతున్నానని తెలిపింది. చదువుపైనా దృష్టి నిలపలేకున్నానని వివరించింది. తాను ఏదైనా ఉద్యోగం చేయడానికి గర్భం ఇబ్బందికరంగా మారిందని కోర్టుకు విన్నవించింది.

ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ సంతానోత్పత్తికి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కును ఎవరూ తోసిపుచ్చలేరని స్పష్టం చేసింది. పిల్లలు కనాలా, వద్దా అనేదానిపై మహిళకు పరిమితులు విధించలేరని వ్యాఖ్యానించింది. సంతానోత్పత్తికి మొగ్గు చూపినా, సంతానోత్పత్తికి దూరంగా ఉండాలని భావించినా, అది పూర్తిగా మహిళ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. మహిళ పునరుత్పత్తికి సంబంధించిన స్వేచ్ఛ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుందని కేరళ హైకోర్టు వెల్లడించింది. ఇదే అంశంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ప్రస్తావించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement