Saturday, April 27, 2024

కరోనా కట్టడి.. అన్ని భవిష్యత్తులోనే చేస్తారా ? : హైకోర్టు

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కట్టడి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల అంశంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇచ్చిన నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో తాము ఇచ్చిన చాలా ఆదేశాలు పాటించలేదని ప్రశ్నించింది. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగింది. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి సరైన సమాధానం లేదని మండిపడ్డింది. ఈ అంశంపై రేపు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు వివరణ ఇవ్వాలని సూచించింది. మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారులకు కరోనా సోకిందనే విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

14 కొత్త ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలు ఇంకా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? హైకోర్టు నిలదీసింది. మరికొన్ని ఆదేశాలు అమలు చేశారో లేదో నివేదికలో వివరించ లేదని పేర్కొంది. మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8 వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని హైకోర్టు గుర్తు చేసింది.

‘’అన్ని భవిష్యత్తు లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా? నిలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా?మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? లైసెన్సు రద్దు చేసిన ఆస్పత్రులకు బాధితులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చారా?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

డీహెచ్ ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరు కాలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలు ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రానికి ఆదేశించింది. కరోనా పరిస్థితులపై విచారణ రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement