Wednesday, May 1, 2024

ఈటలకు హైకోర్టు షాక్.. సర్వే చేస్తే తప్పేంటి?

దేవరయాంజల్ భూముల సర్వేపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవరయంజాల్ భూముల అవకతవకలపై విచారణ జరిపేందుకు జారీ చేసిన 1014 జీవోను రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దేవాల‌య‌ భూములు గుర్తించేందుకు స‌ర్వే చేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించింది. గురువారం దేవరయాంజల్ భూముల సర్వేపై హైకోర్టులో విచారణ జరిగింది. ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని సదా కేశవ రెడ్డి అనే వ్య‌క్తి పిటిషన్ దాఖ‌లు చేశారు. అయితే, జీవో 1014 అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దేవాల‌య‌ భూములు గుర్తించేందుకు స‌ర్వే చేస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించింది. అలాగే, ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా? అని నిల‌దీసింది. కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా? అని వ్యాఖ్యానించింది.

దేవరయాంజల్ భూముల‌పై విచారణ జరిపి నివేదిక ఇవ్వడమే కమిటీ బాధ్యతని పేర్కొంది. అయితే, నోటీసులు ఇవ్వకుండానే భూముల్లోకి వ‌చ్చి సర్వే చేస్తున్నార‌ని పిటిషనర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తెచ్చారు.  దేవరాయాంజల్ భూములపై విచారణ చేసే స్వేచ్చ కమిటీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, భూముల్లోకి వెళ్లే ముందు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లపై చర్యలు తీసుకుంటే ముందస్తు నోటీసు ఇవ్వాలని తెలిపింది. అధికారుల‌కు అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లకు ఆదేశించింది. ఒక‌వేళ విచారణకు సహకరించకపోతే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కాగా, మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మేడ్చ‌ల్ జిల్లా శామీర్ పేట శివారులోని దేవ‌ర‌యంజాల్ గ్రామంలోని సీతారాముల ఆల‌య భూములను క‌బ్జా చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దేవరయంజాల్‌లో ఆలయ భూములను ఆక్రమించారనే ఆరోపణపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మే 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014ను సవాల్‌ చేస్తూ హైకోర్టు పిటిషన్‌‌ దాఖలైంది. దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని పిటిషీనర్ కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement