Monday, April 29, 2024

తెలంగాణలో టీకాల పంపిణీకి బ్రేక్

తెలంగాణకు కేంద్రం నుంచి తగినన్ని డోసులు రాకపోవడంతో రాష్ట్రంలో టీకాల కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం వ్యాక్సినేషన్‌ను నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 45 ఏళ్లుపై బడిన వారికి టీకాలు వేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు 30.7 లక్షల డోసుల టీకాలు మాత్రమే వచ్చాయి. కేంద్రం పంపిణీ చేసిన మొత్తం టీకాల్లో ఇది కేవలం 2.1 శాతమే. ఈ జాబితాలో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం నాటికి మొత్తం 28 లక్షల మందికి టీకాలు వేశారు. శనివారం వ్యాక్సినేషన్‌ తర్వాత కేవలం 1.5 లక్షల డోసులే అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక్క రోజుకు కూడా సరిపోవు. దీంతో ఆదివారం ప్రభుత్వ కేంద్రాల్లో టీకా పంపిణీని నిలిపివేశారు. కేంద్రం నుంచి ఆదివారం సుమారు 2.7 లక్షల డోసులు రానున్నాయని సమాచారం. అయితే, అవి సెకండ్‌ డోస్‌కు మాత్రమే సరిపోతాయని అధికారవర్గాలు తెలిపాయి.

కేంద్రం నుంచి వ్యాక్సి న్‌ డోసులు వస్తే సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1.75 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.61 లక్షల మంది తొలిడోస్‌ తీసుకోగా, 13,833 మంది రెండో డోస్‌ తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 28.01 లక్షల మందికి టీకాలు వేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ భారీ ఎత్తున చేపట్టామని, దానికి తగినట్టు టీకాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇటీవల 30 లక్షల డోసులు ఇవ్వాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. అయితే, కేంద్రం మాత్రం కేవలం 4 లక్షల డోసులు పంపిణీ చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement