Wednesday, May 1, 2024

Karnataka: దళిత బాలిడిపై దాష్టీకం.. కరెంట్​ స్తంభానికి కట్టేసి చితకబాదిన అగ్రవర్ణాలు

కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ 14 ఏళ్ల దళిత బాలుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. ప్రశ్నించిన బాలుడి తల్లిని కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో వారిని ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. కాగా, ఈ అమానవీయ చర్యకు సంబంధించి పది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

కర్నాటక రాష్ట్రం చింతామణి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. దళిత కులానికి చెందిన బాలుడు దొంగతనం చేశాడని అనుమానంతో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. కెంపదేనహళ్లిలో నివాసముంటున్న యశ్వంత్ అనే బాలుడు తన ఏజ్​లో ఉన్న ఇతర అబ్బాయిలు, అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వారితో ఆడుకుంటుండగా అగ్రవర్ణానికి చెందిన బాలిక బంగారు చెవిపోగు పోయింది. దీంతో యశ్వంత్ చోరీ చేశాడని ఆరోపణలు వచ్చాయి.

బాలుడి పాత్రపై అనుమానంతో అగ్రవర్ణాల వారు బాధిత బాలుడిని ఈడ్చుకెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. తన కుమారుడిని రక్షించేందుకు పరుగున వచ్చిన అతని తల్లిని కూడా కొట్టారు. యశ్వంత్, అతని తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన గురువారం జరిగింది.. కాగా, కేసు నమోదు కావడంతో ఇవ్వాల (శనివారం) వెలుగులోకి వచ్చింది. ఇక.. చింతామణి రూరల్ పోలీసులు బాధిత బాలుడు, అతని తల్లి వాంగ్మూలాలను నమోదు చేశారు. అగ్రవర్ణానికి చెందిన 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాకుండా కర్నాటక రాష్ట్రంలోనే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.. మరో ఘటనలో చిక్కబళ్లాపూర్ జిల్లాలో హిందూ దేవుడి విగ్రహాన్ని తాకినందుకు దళిత బాలుడి కుటుంబానికి అగ్రవర్ణాల వారు రూ.60,000 జరిమానా విధించారు. ఆ తర్వాత ఆ బాలుడి కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరించారు. దీనిపై ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement