Tuesday, April 30, 2024

పేద‌ల‌కు ప‌క్కా ఇళ్ల ప‌ట్టా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వారం రోజుల్లో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పూర్తిచేసి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై శుక్రవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కీలక అంశాలపై చర్చించింది. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎర్రబెల్లి దయా కర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఇళ్ల పట్టాల పంపిణీకి సత్వర చర్యలు తీసుకోవాలని ఉపసంఘం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు రోజూవారీ సమీక్ష నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రివర్గ ఉపసంఘం దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలను నిజం చేయాలని పేర్కొన్నారు. పేదలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఇండ్ల స్థలాల పంపిణీపై కూడా సమావేశం విస్తృతంగా చర్చించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏ జిల్లాలో ఎన్ని భూములు సిద్దంగా ఉన్నాయి… పట్టాల పంపిణీకి ఉన్న అవకాశాలు సిద్దం చేయాలని, అనువైన భూముల జాబితా సిద్ధం చేయాలని సీసీఎల్‌ఏను సబ్‌ కమిటీ ఆదేశించింది.

ఎన్నికల ఏడాదిలో నిరుపేదలకు ఊతంగా మరో పథకానికి సర్కార్‌ శ్రీకారం చుట్టనుందన్న ఆలోచనల నేపథ్యంలో ఉచితంగా ఇంటి స్థలాల పంపిణీ దిశగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉచిత స్థలాల పంపిణీపై సబ్‌ కమిటీ చర్చించింది. గత కొంత కాలంగా సీఎం కేసీఆర్‌ సూచనలతో అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం త్వరలో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. తాజా నిర్ణయంలో భాగంగా ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లతోపాటు, ఉచితంగా ఇండ్ల స్థలం కేటాయింపు దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 33 జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాలను సేకరించి రెడీగా పెట్టుకున్న ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన దిశగా సమాయత్తమవుతున్నది. ఇప్పటికే రూ.3 లక్షల ఆర్థిక సాయంతో సొంతింటి నిర్మాణానికి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరోవైపు జీవో 58 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి ఉచితంగా ఆయా స్థలాల క్రమబద్దీకరణ చేస్తోంది. అయితే ఇంకా ఇళ్లులేని, ఎటువంటి భూమిలేని నిరుపేదల పరిస్థితి ఏమిటనే కోణంలో తీవ్రంగా యోచించిన ప్రభుత్వం త్వరలో వీరికి ఉపయుక్తమయ్యే పథకం అమలుకు సంకల్పించనున్నది. నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు కొరత ఉన్న ప్రాంతాల్లో వారికి అందుబాటులో ఉన్న వాటిని గుర్తించి ప్రభుత్వమే 75నుంచి 100 గజాల్లోపు స్థలాలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రామస్థాయిలో అందుబాటులో ఉన్న భూములు, ఏ రకమైన భూములున్నాయి.. అనే వివరాలను సేకరించి సమాచారం క్రోడీకరించుకుని దగ్గర పెట్టుకొంది. నియోజకవర్గం కేంద్రంగా ఈ గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఇలా అన్ని జిల్లాల నుంచి వివరాలు సర్కార్‌కు చేరడంతో త్వరలో మరో కొత్త పథకం ఊపిరిపోసుకోనున్నదని అంటున్నారు. ఆయా స్థలాల గుర్తింపు తర్వాత బడుగు, బలహీనవర్గాల వారిలో అర్హులను గుర్తించి పట్టాలు ఇచ్చేందుకు అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ల నుంచి ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకొంది. నిర్ధేశిత ఫార్మాట్‌లో వచ్చిన వివరాల ఆధారంగా కొత్త పథకంపై కార్యాచరణ మొదలు పెట్టినట్లు సమాచారం. గతంలో పంపిణీకి మిగిలిపోయిన భూములతోపాటు, ఇటీవలే ప్రభుత్వ ఖాతాకు చేరిన భూములు, ల్యాండ్‌ బ్యాంక్‌లో నివాస యోగ్యమైన భూములు, వివాదాల్లోలేని, ప్రభుత్వానికి చెందిన భూములను గుర్తించారు. ఇలాంటివి ఎక్కడెక్కడ… ఏయే జిల్లాల్లో ఎంత మేర ఉన్నాయనే లెక్కలు తీసిన ప్రభుత్వం గత కేటాయింపుల వివరాలను పరిశీలిస్తోంది. అదేవిధంగా గతంలో ప్లాట్లు పొందిన లబ్దిదారులు ఇతరులకు వాటిని విక్రయించు కోవడంతోపాటు, ఇతరులు ఇండ్లు నిర్మించుకున్న స్థితిగతులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతేకాకుండా భారీగా ఖాళీ స్థలాలు కూడా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది.

గత కేటాయింపులపై కూడా…
లక్షలాది ఎకరాల విలువైన ప్రభుత్వ భూముల కైంకర్యం వాస్తవాలను విప్పేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూముల పందేరాల సంగతి తేల్చాలని సర్కార్‌ భావిస్తున్నట్లుగా తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా జరిగిన కేటాయింపులతోపాటు, ప్రస్తుతం ఉన్న విలువైన భూముల వివాదాలను నిశితంగా పరిశీలించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అవుతుండటంతోపాటు, కోర్టుల్లో సరైన పత్రాలు అందించలేని అధికారుల వైఫల్యాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా పలు ప్రభుత్వ కమిటీలు ఈ అంశంపై కీలక నివేదికలు ఇచ్చాయి. వాటి ఆధారంగా తెలంగాణ భూభాగంలోని విలువైన భూములను పొంది నిర్దేశిత అవసరాలకు వినియోగించిని వారి వివరాలతోపాటు, బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందిన వారి వివరాలను సేకరిస్తోంది. కాగా ఇందుకు కేంద్రబిందువుగా ఉన్న అసైన్‌మెంట్‌ విభాగంలో ఫైళ్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఆయా దస్త్రాల్లో పేర్కొన్నట్లుగా ప్రభుత్వ భూములను ఏఏ అవసరాలకు ఎవరెవరికి ఎంత మొత్తంలో కేటాయించారనే లెక్కలను సమగ్రంగా సేకరిస్తోంది. నివేదికలోని వివరాలను ప్రభుత్వ రికార్డులతో పోల్చి చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భూములు ఎవరికి కేటాయించారు. వాటిని నిర్ధేశిత అవసరాలకు వినియోగించారా… లేదా అనే అంశం వెలుగులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement