Wednesday, July 24, 2024

Special Story – పొలిటికల్​ ఫౌండేషన్​ – అరంగేట్రానికి ఇదే అసలు వేదిక సిరిసిల్ల అర్బన్​ బ్యాంకు


రాజకీయాలకు అడ్డాగా సిరిసిల్ల అర్బన్​ బ్యాంకు
లీడర్ల ఎంట్రీకి ఇదో గొప్ప అవకాశం
ప్రిలిమినరీ టెస్ట్​గా మారిని అర్బన్ బ్యాంక్ ఎన్నికలు
పోటీలోకి దిగుతున్న కొత్తతరం నాయకులు
ఆ తర్వాత ప్రధాన పార్టీల్లోకి జంప్​
సత్తా చాటుతున్న వారు ఎందరో..

- Advertisement -

ఆంధ్రప్రభ, సిరిసిల్ల: రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలనుకున్న కొత్త తరం ముందుగా సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నారు. గతంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికై ఆ తరువాత మున్సిపల్ కౌన్సిల్ బాట పట్టి తమ సత్తాను చాటుకున్న ఉదంతాలు ఉన్నాయి. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో రాణించినవారు మున్సిపల్ ఎన్నికల్లో వారందరూ రాణించలేక పోయినప్పటికీ.. అనేక మంది ముందుగా రాజకీయాలకు ” ప్రిలిమినరీ పరీక్ష ” గా అర్బన్ బ్యాంకును వేదికగా చేసుకోవడం ఆనవాయితీగా మారింది.

ఎందరో అరంగేట్రం

గతంలో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా ఎన్నికైన పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఇటు టీడీపీలోనూ, తర్వాత బీఆర్ఎస్ పార్టీల్లోనూ రాణించారు. ప్రస్తుతం చక్రపాణి సతీమణి జిందం కళ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నిక చేయించడంలో విజయవంతం అయ్యారు. మరో బీఆర్ఎస్ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, పవర్ లూమ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ రెండు పర్యాయాలు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికై తర్వాత ఐదేళ్ల పాటు ఇదే బ్యాంకు చైర్మన్ గా కొనసాగి రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చే యువత అర్బన్ బ్యాంకును రాజకీయాలకు వేదికగా చేసుకుని అరంగేట్రం చేస్తుండగా మున్సిపల్ కౌన్సిలర్ గా పదవులు నిర్వహించిన వారు కొందరు తిరోగమన దిశగా మళ్లీ అర్బన్ బ్యాంక్ వైపు వచ్చిన వారు లేకపోలేదు.

అందరి చూపు అటువైపే..

అయితే బ్యాంకు సేవలపై, కార్యకలాపాలపై, బ్యాంకును ఎలా అభివృద్ధి చేయాలనే అవగాహన లేని అనేకమంది కొత్త, పాత రక్తం సైతం అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో పాల్గొనడానికి చొరవ చూపుతున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో అర్బన్ బ్యాంకు ఎన్నికల్లోకి ఆశావహులు ఎగబడుతున్నారు. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసే వారికి రాజకీయ పార్టీలు ఊతం ఇవ్వడంతో ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఖర్చుకు కూడా వెనుకాడడం లేదు. ఆర్థికంగా లేకపోయినప్పటికీ రాజకీయాలపై మక్కువ ఉన్నవారు మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో వారందరూ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పాల్గొని తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

డబ్బులతో డైరెక్టర్​గా..

అయితే, బ్యాంకు ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేదలు, బడుగు వర్గాలకు ఎలా సేవలు అందించాలనే ధ్యేయంతో కాకుండా నిబద్ధతకు తిలోదకాలు ఇస్తూ డబ్బులతో డైరెక్టర్ గా ఎన్నికై తర్వాత చైర్మన్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చంతా రాబట్టుకుంటున్నారు. అలా రాజకీయాలు చేసేవారే తెరపైకి రావడం శోచనీయంగా భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నామినేషన్ వేయడానికి బదులు, చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు వేసే డివిజన్లలో నామినేషన్లు వేస్తూ డబ్బులకు అమ్ముడుపోయి చైర్మన్ స్థానం అభ్యర్థులను ఏకగ్రీవం చేయడానికి అనుకూలంగా పోటీ నుండి ఉపసంహరించుకోవడం లాంటి చర్యలపై బ్యాంకు ప్రాథమిక సభ్యులు దుయ్యబడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement