Sunday, April 28, 2024

ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో భోజన, వసతి, రవాణా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌ నుంచి తిరిగొస్తున్న భారత విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు, ఇతర పౌరులను వారి ఇళ్లకు చేర్చే బాధ్యత తమదేనని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. శనివారం ఈ మేరకు ఏపీ భవన్ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించి, బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులను గుర్తించి, ఎయిర్‌పోర్ట్ నుంచి ఏపీ భవన్‌కు తీసుకొచ్చేందుకు ఒక కమిటీ, వారికి భవన్ అతిథి గృహంలో భోజన, వసతి సదుపాయాలు కల్పించడం కోసం ఒక కమిటీ, ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేయడం కోసం ఒక కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడేందుకు హెల్ప్ లైన్ వంటి ఏర్పాట్లను చేసినట్టు వివరించారు. ప్రస్తుతం కొంత మంది విద్యార్థులు రోడ్డు మార్గం ద్వారా ఉక్రెయిన్ సరిహద్దులు దాటి రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారని, వారిని ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో విదేశాంగ శాఖ ఢిల్లీ, ముంబై నగరాలకు తరలిస్తోందని తెలిపారు.

తమ దగ్గరున్న అంచనాల ప్రకారం ఉక్రెయిన్‌లో మొత్తం 1,100 మంది వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులున్నారని, వారిలో యుద్ధం మొదలవక ముందు 300 మంది వరకు విద్యార్థులు తమ స్వస్థలాలకు చేరుకున్నారని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నవారిలో ఎక్కువ శాతం వైద్య విద్యార్థులేనని, అందులో మొదటి రెండు సంవత్సరాల వైద్య విద్యలో ఉన్నవారు తిరిగిరాగా 3వ సంవత్సరం, ఆపైన చదువుకుంటున్న విద్యార్థులు పరీక్షల కారణంగా ఆగిపోయినట్టు తెలిసిందని అన్నారు. ఉక్రెయిన్‌లో మొత్తం 4 మెడికల్ యూనివర్సిటీలు ఉండగా, తెలుగు విద్యార్థుల్లో 90 శాతం మంది జాపొరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ఏర్పాటు చేసిందని, అందులో ఇప్పటి వరకు 350 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఇతర మార్గాల్లో కూడా తాము విద్యార్థుల గురించి సమాచారం సేకరించి జాబితా తయారు చేస్తున్నామని అన్నారు. భవన్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఏపీలోని అన్ని జిల్లాలకు చెందినవారున్నారని, తద్వారా తమకు విద్యార్థుల స్వస్థలాలను, వారి తల్లిదండ్రుల వివరాలను సేకరించడం కాస్త సులభతరమైందని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. మొత్తంగా ఏపీ భవన్‌లోని మొత్తం సిబ్బంది ఉక్రెయిన్ బాధిత ఏపీ విద్యార్థుల సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement