Friday, May 17, 2024

శునకం సైజ్ డైనోసార్ శిలాజం లభ్యం!

ప్ర‌భ‌న్యూస్ : రాకాసిబల్లులంటే (డైనోసార్) పేరుకు తగ్గట్టు అతిభారీ పరిణామంలో ఉండేవని, వాటిలో ప్రమాదకరమైనవి, ఎగిరేవి ఉండేవని, ఉల్కాపాతాల వల్ల అంతరించిపోయాయని చెబుతారు. జురాసిక్ పార్క్ వంటి సినిమాలు రాకముందే ఈ రాకాసి బల్లుల కథలు ప్రజలకు తెలుసు. కాకపోతే, ఇప్పుడు అతి చిన్న పరిమాణంలో ఉండే.. అంటే ఓ వీధికుక్క పరిమాణంలో ఉండే డైనోసార్లు కూడా ఉండేవని నిర్ధారణ అయింది. చిలీ దేశంలో తాజాగా దొరికిన అలనాటి చిన్నసైజు డైనోసార్ శిలాజాలు లభ్యమవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా దొరికిన ఈ కొత్తరకం డైనోసార్ శిలాజం 7.2 కోట్ల నుంచి 7.5 కోట్ల సంవత్సరాల క్రితానిదని తేల్చారు. ఈ డైనోసార్కు తోక కూడా ఉండటం విశేషం. తోకను శత్రువులపై దాడి చేయడానికి ఇవి ఉపయోగించేవని పరిశోధకులు భావిస్తున్నారు. వింతగా కనిపిస్తున్న ఈ డైనోసార్ శిలాజంపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాలని చిలీ యూనివర్శిటీకి చెందిన పాలియోంథాలజిస్ట్ వర్గాస్ వెల్లడించారు.

వర్గాస్ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం చిలీలో పరిశోధనలు చేస్తుండగా ఈ వింత రూపంలో ఉన్న డైనోసార్ శిలాజం లభ్యమంది. దాని కపాలాన్ని, తోక బాగాలను పరిశీలించి ఐదు విభాగాలుగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇవి పూర్తిగా శాఖాహార జీవులని నిర్ధారించారు. స్టెగోసారస్ జాతికి చెందిన రాకాసి బల్లులకు ఇవి బంధువుర్గమని సూత్రీకరించారు. ఇసుకకింద కూరుకుపోవడంతో అది మరణించిందని, పక్షిలాంటి ముక్కు, తోక, వాటికి ముళ్లలాంటి కొమ్ములు ఉన్నాయని, నేలకంటుకున్న ఉదరం కన్పించాయని వారు చెప్పారు. దక్షిణ చిలీలో పరిశోధనల్లో భాగంగా భూమి ఉపరితలంపై తవ్వుతున్నప్పుడు ఈ శిలాజం బయటపడింది. అయితే చిలీలో డైనోసార్లకు సంబంధించిన ఆధారాలు లభ్యమవడం ఇదే తొలిసారని మరో పరిశోధకుడు, మకాలెస్టర్ కాలేజీ బయాలజిస్ట్ క్రిష్టి కర్రీ రోజర్స్ చెప్పారు.

ఇంతవరకు ఉన్న ఆధారాల ప్రకారం స్టెగోసారస్ రాకాసిబల్లులు సాధారణంగా ఆరడగులుంేవని, వాటి తోక చాలా పదునైన ముళ్లవంటి కొనలతో పొడవుగా ఉండేవని తేలింది. దాదాపు అదే రూపంలో ఉన్నప్పటికీ తాజా శిలాజం పరిమాణం మాత్రం ఓ శునకం మాదిరిగా ఉండటం, అందులో ఎముకలు పూర్తిగా ఎదిగిన జీవికి చెందినవిగా నిర్ధారణ కావడంతో ఆ కాలంలో ఈ బుల్లి డైనోసార్లు ఉండేవని తేలింది. శిలాజాల ఆధారంగా అప్పటి ఈ తరహా డైనోసార్లు ఎలా ఉండేవో ఓ ఊహాచిత్రాన్ని పరిశోధకులు విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement