Tuesday, July 23, 2024

Singareni Collieries ప‌క్క‌దారి పట్టిన న‌ల్ల బంగారం – ఇటుక బట్టీలపై సింగ‌రేణి దాడులు


ఆంధ్ర‌ప్ర‌భ‌ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండ‌ల ప‌రిధి విలాసాగర్ వ‌ద్ద ఉన్న‌ ఇటుక బట్టీలకు సింగ‌రేణి బొగ్గు వాడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ బొగ్గును అనుమతులు లేకుండా అక్రమంగా త‌ర‌లించి పెద్ద ఎత్తున‌ నిల్వ చేసినట్లు సింగరేణి సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి రామగుండం, భూపాలపల్లి సింగరేణి సెక్యూరిటీ అధికారులు తమ సిబ్బందితో మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇటుక బట్టీల‌ వద్ద సుమారు 50 టన్నుల బొగ్గు నిల్వ ఉండటంతో పట్టుకున్నారు. నిర్వాహకులు కానీ,, అక్కడ పనిచేస్తున్న వారు కానీ దీనికి సంబంధించిన ర‌శీదులు చూపక పోవడంతో అక్కడే ఉన్న ఇద్దరిని కాటారం పొలిష్టేషన్ కు తరలించి ఫిర్యాదు చేశారు. అనంతరం రామగుండం సింగరేణి అధికారులు ఈ బొగ్గు వారికి ఎక్కడి నుండి వచ్చింది, కొనుగోలు చేశారా..తస్కరించారా? ఏ ప్రాంతానికి చెందిన గ్రేడ్ బొగ్గు అనే విషయం తెలుసుకునేందుకు శాంపిల్స్ తీసుకుని టెస్ట్ కు పంపించారు.

చంద్రాపూర్ నుంచి తీసుకొచ్చిన‌ట్టు న‌కిలీ ర‌శీదులు

గోదావరిఖని పరిధిలో ఓ కాంట్రాక్టర్ ద్వారా బొగ్గు పక్కదారి పట్టినట్లు సమాచారంతో అధికారులు అనుమానిస్తూ ఆ కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. బట్టి నిర్వహించే వారు చంద్రాపూర్ లో బొగ్గు కొనుగోలు చేసినట్లు రసీదులు సమర్పించినట్లు తెలిసింది. సింగరేణి అధికారులు మాత్రం అంత దూరం నుండి అంత వ్యయం వెచ్చించి ఇటుక బట్టిలకు బొగ్గు ఇక్కడికి తెచ్చే అవకాశం లేదనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సింగరేణి అధికారులు ముందుకు వెళుతున్నారు. ఈ విషయమై సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం హాబిబ్ హుస్సేన్ ను సోమవారం వివరణ కోరగా.. విలసాగర్ లో ఇటుక బట్టిలో బొగ్గు నిల్వలు తమ సెక్యూరిటి అధికారులు పట్టుకున్నది వాస్తవమేనని దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement