Saturday, May 4, 2024

సీపీఎంపై షర్మిల విమర్శలు.. తమ్మినేని ఆగ్రహం..

హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనకు సిద్దమవుతున్న వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నేటి ఉదయం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తో చర్చలు జరిపారు. అనంతరం హైదరాబాద్ లో సీపీఎం కార్యాలయానికి ఆమె వెళ్లారు. అక్కడ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఇతర నేతలతో నిరుద్యోగుల సమస్యలపై చర్చించారు. యువతకు ఉపాధి కల్పించడం కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామని ఆమె కోరారు.

ఆ తర్వాత సీపీఎం నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీపీఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందని ఎత్తిపొడిచారు. తాను కానీ, తమ పార్టీ కానీ బీజేపీకి ఎప్పుడూ బీ టీమ్ కాదని, కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తున్న పార్టీ తమదని చెప్పుకొచ్చారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ… షర్మిల వ్యాఖ్యలను తప్పుబట్టారు. తమ కార్యాలయానికి వచ్చి.. తమ పార్టీపై విమర్శలు చేయడం ఏమిటంటూ మండిపడ్డారు. తమకు సంస్కారం ఉందని, షర్మిల లా తాము మాట్లాడలేమని, నిష్టూరమాడారు. పార్టీ కార్యాలయానికి వస్తామంటూ షర్మిల ఫోన్ చేయడంతో ఆహ్వానించామని, అయితే తమ పార్టీ విధానాలనే ప్రశ్నించడం తమకు అసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బాహాటంగానే అధికార పార్టీకి మద్దతు ప్రకటించి, ప్రచారం కూడా చేశామని, ఇందులో ఎటువంటి దాపురికం లేదని చెప్పారు. కానీ షర్మిల మాత్రం తమ పార్టీపై అనవసరమైన నిందలు వేయడం బాధించిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement