Tuesday, May 28, 2024

కొత్త వారికి టిక్కెట్లు ఇస్తే మ‌రి మాకు? బిజెపిలో సీనియ‌ర్ల క‌ల‌వ‌రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుని టికెట్లను ఇస్తే తమ పరిస్థితి ఏంటీ..? అన్న ఆందోళన ఎప్పటినుంచే బీజేపీనే నమ్ముకున్న ముఖ్య, సీనియర్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ కార్యక్రమాల కోసం నిధులు వెచ్చిస్తూ నియోజకవర్గంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో చాలా మంది బీజేపీ నేతలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి రానున్న రోజుల్లో పేరున్న లీడర్స్‌ చేరనున్నారన్న వార్తలు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న నేతల్లో గుబులు పుట్టిస్తోంది. తెలం గాణలో బీజేపీని బలోపేతం చేసే కార్యచరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో అసంతృప్త, ముఖ్యనేతలపై కన్నేసింది. బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా సీనియర్‌ రాజకీయ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యేల ఈటల రాజేందర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. కాషాయ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కమిటీ ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. ఇటీవలే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావును కలిసి బీజేపీలో చేరాలని ఆహ్వానించింది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపే దాదాపు 22 మంది వరకు ఉన్న ఇతర పార్టీలకు చెందిన నేతలు త్వరలోనే బీజేపీలో చేర్చుకునేందుకు కమిటీ వ్యూహాత్మకంగా ముందుకు కదులు తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో బీజేపీ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. ఈసారి టికెట్‌ వస్తుందో రాదోనన్న బెంగ చాలా మందిని వెంటాడుతోంది.

రాష్ట్ర రాజకీయాల్లో బీజేపార్టీ ఉన్నా ఇన్ని రోజులూ నామమాత్రపు ప్రభావానికే పరిమితమైంది. అయితే 2018 ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీ రాష్ట్రంలో పుంజుకోవడం ప్రారంభమైంది. పార్టీకి క్షేత్రస్తాయిలో అంతో ఇంతో ఫాలోయింగ్‌ పెరుగుతోంది. దీనికితోడు 2018 అసెంబ్లి ఎన్నికల తర్వాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్ని కల్లో గెలుపుతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ 47 డివి జన్లలో బీజేపీ కార్పోరేటర్లు గెలిచారు. మునుగోడు ఉప ఎన్ని కలోనూ రెండోస్థానంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి నిలి చారు. ఇటీవల జరిగిన హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీనే మెరుగన్న స్థితికి పార్టీ చేరిందని, ఈ పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న బీజేపీ నేతల సంఖ్య కూడా పెరుగుతోందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ నేతలతో సమావేశమై టికెట్‌ ఆశిస్తున్న బీజేపీ నేతల లిస్టును రెడీ చేయగా దాదాపు 30 స్థానాల్లో కనీసం అయిదు గురు నేతలు పోటీ పడుతున్నట్లు తేలినట్లు తెలుస్తోంది. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచే దాదాపు 22 మంది నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్‌ ఇస్తామన్న హామీతోనే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలను ప్రోత్సహిస్తుండడంతో బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరికి వారే తమకు టికెట్‌ ఇవ్వాలని, తమ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను ప్రోత్సహించొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిని కలిసి వినతులు అందిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement