Monday, May 6, 2024

Spl Story: ఎస్​ఆర్​ బొమ్మై v/s​ యూనియన్​ ఆఫ్​ ఇండియా.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే!

రాజకీయ సంక్షోభం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న విపరీతమైన పరిస్థితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ అవలంభిస్తున్న విధానాలే కారణాలన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇంతకుముందు తమిళనాడులో, ఆ తర్వాత కర్నాటకలో ఇట్లాంటి పరిస్థితులే తలెత్తాయి. దీంతో ఆ సందర్భంలోనూ పొలిటికల్​ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే.. ఇది ఇప్పుడు జరుగుతున్న విషయమేమీ కాదు.. 1994లోనూ ఇట్లాంటి పరిస్థితులే ఎదురై అప్పటి సీఎం ఎస్​ఆర్​ బొమ్మై సర్కారు కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అప్పటి గవర్నర్​ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. దీంతో బొమ్మై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి కేసు తీర్పు నేడు జరుగుతున్న రాజకీయ సంక్షోభాలన్నిటికీ ఎగ్జాంపుల్​గా మారుతోంది..

1994 మార్చిలో SR బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియాలో తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అది.. అధికారంలో ఉన్న పార్టీ యొక్క మద్దతును నిర్ణయించడంలో ఫ్లోర్ టెస్ట్ యొక్క ఆధిపత్యాన్ని నిర్దేశించింది. రాజకీయ సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ ఎస్‌ఆర్‌ బొమ్మై కేసు తీర్పు కీలక పాత్ర పోషిస్తోంది.  ఎస్ఆర్ బొమ్మై కేసు ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనదనే అంశాలను పరిశీలిద్దాం..

అది.. 1985వ సంవత్సరం.. కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యింది. 1988లో హెగ్డే స్థానంలో ఎస్‌ఆర్‌ బొమ్మై వచ్చారు. జనతాదళ్‌లో జనతా పార్టీ విలీనం కావడంతో బొమ్మయి మంత్రివర్గంలోకి కొత్త సభ్యులు చేరారు.

1988 సెప్టెంబరులో జనతాదళ్‌కు చెందిన శాసనసభ్యుడు కెఆర్ మొలకేరి పార్టీ ఫిరాయించారు.  బొమ్మై ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని పేర్కొంటూ మరో 19 మంది శాసనసభ సభ్యులతో కలిసి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్యకు లేఖ అందించారు. దీంతో కేంద్రంలోని ప్రభుత్వం బొమ్మైకి మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది. రాష్ట్రపతి పాలన విధించింది.

అనేక పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిపిన కారణంగా ప్రభుత్వం మెజారిటీని కోల్పోవడమే తొలగింపుకు కారణమైంది. ఆ తర్వాత జనతాదళ్ లెజిస్లేచర్ పార్టీ ఆమోదించిన తీర్మానం కాపీని సీఎం గవర్నర్​కు సమర్పించినప్పటికీ, అసెంబ్లీలో తన మెజారిటీని పరీక్షించుకోవడానికి బొమ్మైకి అవకాశం ఇవ్వడానికి గవర్నర్ పి. వెంకటసుబ్బయ్య నిరాకరించారు.

- Advertisement -

హైకోర్టు నుంచి ఎలాంటి రిలీఫ్​ లభించకపోవడంతో బొమ్మై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అపెక్స్ కోర్ట్ ఈ విషయంలో తన తీర్పును స్పష్టం చేసింది. ఆర్టికల్ 356 ప్రకారం పరిమితులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాల ఏకపక్ష తొలగింపు అనేది సరైంది కాదని తీర్పు వెలువరించింది.

ఆ తీర్పు ఏం చెప్పిందంటే..

బొమ్మై కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ ఆర్టికల్ 356 ఉపయోగం, రాజ్యాంగ పరిమితుల చుట్టూ ఉన్న అనేక సమస్యలపై చర్చించి తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య నిర్మాణాన్ని సమర్థించే కేంద్ర సామర్థ్యాన్ని అరికట్టడానికి సుప్రీం కోర్టు అనేక మార్గదర్శకాలను ఈ సందర్భంగా నిర్దేశించింది. నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్న మద్దతును నిర్ధారించడానికి ఏకైక మార్గం ఫ్లోర్ టెస్ట్ మాత్రమే అని ఈ తీర్పుతో చట్టం నిర్దేశించింది. అలాగే.. రాష్ట్రపతి పాలన యొక్క ప్రకటన చెల్లుబాటు న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని కూడా కోర్టు తీర్పులో స్పష్టం చేసింది.

రాజ్యాంగ యంత్రాంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి రాష్ట్రపతికి షరతులు లేని అధికారాలు ఉంటాయని కోర్టు పేర్కొంది. ఈ తీర్పులో ఫ్లోర్ టెస్ట్ అనే అంశాన్ని కూడా ప్రవేశపెట్టారు. రాష్ట్ర శాసనసభకు మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహించాలని ఆదేశించే ఆర్టికల్ 164 (2)ని ప్రస్తావిస్తూ, మెజారిటీకి అంతిమ పరీక్ష రాజ్‌భవన్‌లో జరగదని, సభా వేదికపైనే జరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

“రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య సూత్రాన్ని, ప్రజల అభీష్టానికి ప్రాతినిథ్యం వహించేది శాసనసభే తప్ప గవర్నర్‌ కాదని.. ఎటువంటి సందేహం లేకుండా ఈ తీర్పును పాటించాలి” అని బొమ్మై తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement