Sunday, May 5, 2024

రిజర్వేషన్లు ఖరారు, 50శాతంతో భర్తీ ప్రక్రియ.. గ్రూప్‌-1లో అమలుకు సన్నాహాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 ఉద్యోగ భర్తీ దిశగా వేగం పెరిగింది. ఇప్పటికే రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా మొత్తం నియామక పోస్టులను సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను 50శాతంతో తుది ఆమోదం తెలిపారు. 50శాతంలో మహిళలకు 33 శాతంగా, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వ్‌ చేసినట్లు సమాచారం. 900 మార్కులతో రాతపరీక్ష, ఇంటర్వ్యూకు 100మార్కులు నిర్దేశించారు. బీసీ (ఏ)కు 7శాతంతో 35 పోస్టులను, బీసీ(బీ)లకు 10శాతంతో 50 పోస్టులు, బీసీ(సీ) 01శాతంతో 05పోస్టులు, బీసి (డి) 35పోస్టులు, బీసీ(ఈ) 04 శాతంతో 21పోస్టులు, ఎస్సీ 15శాతంతో 75 పోస్టులు, ఎస్టీలకు 6శాతంతో 30 పోస్టులు, జనరల్‌ విభాగంలో ఈ డబ్ల్యూఎస్‌లో 10శాతంతో 25 పోస్టులు, స్పోర్ట్స 2శాతంతో 10పోస్టులు, దివ్యాంగులకు 4శాతంతో 20 పోస్టులను ఖరారు చేశారు. మొత్తం పోస్టుల్లో 33శాతం మహిళలకు 166 పోస్టులను కేటాయించ,,ఆరు. దీంతో 503 పోస్టులను ఈ విధానంతో భర్తీ చేస్తారు. ఆర్ధిక శాఖ ఇప్పటికే భర్తీకి ఆమోదం తెలుపగా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. టీఎస్‌పీఎస్సీ ఈ మేరకు సర్వం సిద్దం చేస్తుండగా, యూనిఫాం సర్వీసులపై పోటీ తీవ్రమవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సిలబస్‌ను అప్‌ గ్రేడ్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు 150 మార్కులను నిర్ధారించింది. మెయిన్స్‌కు రాత పరీక్షలో భాగంగా జనరల్‌ ఇంగ్లీష్‌కు 150 మార్కులు, పేపర్‌-1లో జనరల్‌ వ్యాసరచన కింద టాపిక్‌లను పెట్టారు.

ఆర్ధిక శాఖ ఆమోదం నేపథ్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియను పరుగులు పెట్టించే దిశగా సర్కార్‌ శరవేగంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగుల్లో భరోసా నింపే కార్యాచరణ మొదలైంది. సీఎం కేసీఆర్‌ శాఖల వారీగా ప్రకటించిన పోస్టులకు సంబంధిత శాఖలు నోటిఫై చేసే కార్యక్రమం ఊపందుకుంది. నియామక సంస్థలకు వివరాలను అందించాలన్న సీఎస్‌ ఆదేశాలతో అన్ని శాఖలు జీవోల జారీకీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక శాఖ ఉద్యోగ భర్తీకి ఆమోదం తెలపడంతోపాటు, మొత్తం నియామకాలతో పడే ఆర్థిక భారంపై సర్కార్‌కు నివేదిక అందజేసింది.
విద్యాశాఖలో ఇప్పటికే 13,086 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు చెందిన 1200ఖాళీలున్నాయి. వీటిని ఎస్‌జీటీలకు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. గెజిటెడ్‌ హెచ్‌ఎంల విభాగంలో 1970 ఖాళీలుండగా, వీటిని స్కూల్‌ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. స్పూల్‌ అసిస్టెంట్ల విభాగంలో 70శాతం ఎస్జీటీలకు పదోన్నతులను కల్పించడం ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో 5వేలకు పైగా ఖాళీలతో కలుపుకొని మొత్తంగా 10వేల ఖాళీలు అదనంగా ఏర్పడే అవకాశం ఉంది.

భారీగా గ్రూప్‌-1 పోస్టుల భర్తీ…
తెలంగాణ తొలి గ్రూప్‌ -1కు రంగం సిద్ధమైంది. ఈ దఫా గ్రూప్‌-1లో 503 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఉద్యోగ ప్రకటనలో ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన వారికి టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌, ఇంటర్య్వూలు నిర్వహించి 128 నియామకాలు పూర్తి చేసింది. 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ కార్యాచరణ చేపట్టినా, అది ఆచరణలోకి రాలేదు. ఆ తర్వాత ఇప్పుడే ఇంతటి భారీ నోటిఫికేషన్‌తో భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఆర్డీవో, డీఎస్పీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement