Sunday, April 28, 2024

ఒడిశాకి తొలి వందే భార‌త్ రైలు.. ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

మ‌రో వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ కి ప్రారంభోత్స‌వం చేశారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ మేర‌కు పూరీ-హౌరా నగరాల మధ్య తిరిగే వందేభారత్ రైలుకు మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఒడిశాలోని పూరీ స్టేషన్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరా స్టేషన్ల మధ్య తిరిగే ఈ సెమీ హైస్పీడ్ రైలును మోడీ వర్చువల్ గా పచ్చజెండా ఊపారు. అంతేకాదు, రూ.8 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కూడా మోడీ ప్రారంభించారు. కాగా, ఒడిశాకు ఇదే తొలి వందే భారత్ రైలు. పూరీ-హౌరా మధ్య 500 కిలోమీటర్ల దూరాన్ని 6.5 గంటల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు మే 20 నుంచి అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని రైల్వే నెట్‌వర్క్‌కు 100 శాతం విద్యుద్దీకరణను మోదీ జాతికి అంకితం చేశారు. దీంతో నిర్వహణ, నిర్వహణ వ్యయం తగ్గుతుందని.. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు అని.. దాదాపు ఆరున్నర గంటల్లో 500 కి.మీ దూరాన్ని చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో రెండోది అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తున్నందుకు గుర్తుగా హౌరా స్టేషన్‌లో సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించబడింది. 22895/22896 హౌరా-పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్‌గా మే 20 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. గురువారం మినహా వారంలో ఆరు రోజులు నడిచే ఈ రైలు హౌరాలో ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు పూరీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పూరీలో మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు హౌరా చేరుకుంటుందని వారు తెలిపారు. 16 కోచ్‌లతో కూడిన ఈ రైలు ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్‌లలో ఆగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement