Monday, April 29, 2024

కేర‌ళ‌లో తొలి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్.. ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

కేర‌ళ‌లో తొలి వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ..తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎంపీ శశిథరూర్ తదితరులు పాల్గొన్నారు.ఈ రైలు తిరువనంతపురం నుంచి కాసరగోడ్‌ల మధ్య పరుగులు తీయనుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొత్తం కేరళలోని 11 జిల్లాలను కవర్ చేస్తుంది. ఆ జాబితాలో తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ కాసర్‌గోడ్ జిల్లాలు ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

దీని వలన సగటు ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు తగ్గుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది దేశీయంగా తయారు చేయబడిన సెమీ-హై-స్పీడ్ రైలు అన్న సంగతి తెలిసిందే. ఈ రైలు అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది..మోడీ కేరళలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కొచ్చి వాటర్ మెట్రోను కూడా ప్రారంభించారు. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను కలుపుతూ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ సర్వీసులు నడపనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్ మెట్రో. ప్రధాని మోదీ తిరువనంతపురంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య విధానానికి పెద్దపీట వేస్తోందన్నారు. కేరళ అభివృద్ధి చెందితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement