Sunday, May 5, 2024

వైద్యం అంద‌క గ‌ర్భిణీ మృతి- రాజీనామా చేసిన పోర్చుగ‌ల్ ఆరోగ్య‌మంత్రి

స‌కాలంలో వైద్యం అంద‌క భార‌తీయ గ‌ర్భిణీ పోర్చుగ‌ల్ లో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోర్చుగల్ ఆరోగ్య మంత్రి మార్టా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. ఏక వాక్యంతో మార్టా టెమిడో తన రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించారు. ఈ పదవిలో తాను కొనసాగే పరిస్థితి లేదన్నారు. ఆమె రాజీనామాను ప్రధాని ఆమోదించినట్టు పోర్చుగల్ అధికారిక మీడియా ఆర్టీపీ న్యూస్ ధ్రువీకరించింది. రాజధాని లిస్బన్‌లో భారతీయ మహిళ మృతి చెందినట్టు మీడియా కథనాలు వెలువడిన ఐదు గంటల్లోనే ఆరోగ్య మంత్రి తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఆరోగ్య మంత్రి మార్టా టెమిడో రాజీనామా, ఆమె స్థానంలో నియమించే ప్రతిపాదన కోసం అధ్యక్షుడు మార్సెలో రెబెలో డె సౌసా ముందుగానే ఊహించారని పేర్కొంది..ఆరోగ్య మంత్రి మార్టా టెమిడో రాజీనామా గురించి అధ్యక్షుడికి ప్రధానమంత్రి తెలియజేశార‌న్నారు.

నియోనాటాలజీ విభాగంలో ఖాళీలు లేకపోవడంతో భారతీయ మహిళను డి శాంటా మారియా నుంచి సావో ఫ్రాన్సిస్కో జేవియర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ క్రమంలో కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌కు గురైన ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు.సావో ఫ్రాన్సిస్కో జేవియర్ హాస్పిటల్‌ సెంట్రో హాస్పిటలార్ యూనివర్సిటారియో లిస్బోవా నోర్టే ప్రకారం.. గర్భిణీని అత్యవసర సిజేరియన్ విభాగానికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సకు చేరిన ఆమె పరిస్థితి విషమించి కన్నుమూసిందని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొంది. మరోవైపు, మంత్రి పదవికి మార్టా టెమిడో రాజీనామా చేసినా.. మరొకర్ని నియమించే వరకూ తాత్కాలికంగా బాధ్యతలు చేపడతారు. సెప్టెంబరు 15న నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో కొత్త మంత్రి నియామకానికి ఆమోదం తెలుపుతారు. అత్యవసర ప్రసూతి సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఆరోగ్య మంత్రి నిర్ణయం వ‌ల్లే ఆ మ‌హిళ మృతి చెందిద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement