Wednesday, May 1, 2024

Political Story – ముంద‌స్తు ఎన్నిక‌ల వైపు కేంద్రం అడుగులు

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పలు సంకేతాలొస్తున్నాయి. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇందుకనుగుణంగా వ్యూహాల్ని అమల్లోకి తెచ్చేసింది. వాస్తవానికి ప్రధాని మోడి, హోంమంత్రి అమిత్‌షాలు దీర్ఘకాలంగా జమిలీ ఎన్నికలపై ఆసక్తి పెంచుకున్నారు. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రచారంలో జాతీయ సమస్యలకే ప్రాధాన్యత ఏర్పడుతుందని భావించారు. తద్వారా కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లోనూ బీజేపీకి అధికారం దక్కుతుందని అంచనాలేశారు. అయితే జమిలీ నిర్వహణకు అనువైన రాజ్యాంగ సవరణలకు న్యాయసూత్రాలు అంగీకరించడం లేదు. దీంతో ఇప్పటికే మోడి, షాలు ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు. కాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలతోపాటు జలంధర్‌ ఉప ఎన్నికల ఫలితాల్ని కేంద్రంలోని బీజేపీ సీరియస్‌గా పరిగణిస్తోంది. తన వ్యూహాలను సమీక్షించుకుంది. రానున్న మే వరకు వేచిచూస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్ల సాధన కష్టమని గుర్తించింది. కనీసం నాలుగైదు మాసాలు ముందుగానే లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కోవాలని నిర్ణయించింది.

(న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)
దక్షిణాదిన బీజేపీకి గట్టిపట్టుగల కర్ణాటక అసెంబ్లి ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధాన నినాదం హిందుత్వ పని చేయలేదు. అలాగే ఇక్కడ మోడి చరిష్మా కూడా ఓట్లు రాల్చలేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విభాగాలు క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేస్తు న్నాయి. కానీ అవేవీ ఓటర్ల మనోభావాల్ని బీజేపీకి అను కూలంగా మార్చలేకపోయాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా విపక్షాల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. ఇప్పటికే 17 విపక్ష పార్టీలు రెండుసార్లు సమావేశాలు జరిపాయి. ఐక్యంగా ఎన్నికల్ని ఎదుర్కొ నేందుకు సిద్ధపడుతున్నాయి. రాన్రాను విపక్షాల బలం కాస్తోకూస్తో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే గత కొన్నిమాసాలుగా దేశంలో ద్రవ్యో ల్బణం పెరిగింది. ధరలు జోరందుకున్నాయి. వృద్ధి రేటులో క్షీణత నమోదౌతోంది. ఆర్థిక వ్యవహారాలు బలహీనంగా ఉన్నాయి. దీనికితోడు మణిపూర్‌ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఏడాది చివర్లోగా తెలంగాణా, వి ుజోరాం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లిdలకు ఎన్నికలు జరగాలి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని మినీపార్లమెంట్‌గా పరిగణిస్తున్నారు. ఇందులో బీజేపీ ఆశించిన ఫలితాల్ని సాధించలేని పక్షంలో విపక్ష కూటమికి మరింత బలం చేకూరుతుంది. సొంత పార్టీలోనూ ఆత్మన్యూనతాభావం ఏర్పడుతుంది. వీటన్నింటిని బీజేపీ అధిష్టానం పరిగణనీలోకి తీసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ కొత్త మిత్రుల ఎంపికను మొదలెట్టింది. వాస్తవానికి 2014లో బీజేపీతో ఉన్న పలు మిత్రపక్షాలు ఆ తర్వాత దూరమయ్యాయి. తెలుగుదేశం, అకాలీదళ్‌, శివసేన, యునైటెడ్‌ జనతాదళ్‌లు పక్కకుపోయాయి. తిరిగి అకాలీదళ్‌, జేడీఎస్‌లను కలుపుకునేందుకు ఇప్పుడు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే గతంలోలా ఇప్పుడు బీజేపీతో మైత్రి కోసం ప్రాంతీయ పార్టీలు పెద్దగా ప్రాకులాడ్డంలేదు.

1999లో కాంగ్రెస్‌ ఒంటరి పోరుకు దిగింది. విపక్షానికే పరిమితమైంది. 2004లో బీజేపీ మిత్రపక్షాలన్నింటిని పక్కనపెట్టి ఒంటరిగా పోటీ చేసింది. ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు జాతీయ పార్టీలేవీ దేశం మొత్తంగా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితిలేదని ప్రధాన పార్టీలు రెండింటికి తెలిసొచ్చింది. ప్రాంతీయ పార్టీలకు లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా సీట్లు దక్కపోయినా వాటిను కలుపుకుని వెళ్ళే జాతీయ పార్టీలకు ఓట్ల శాతం పెరుగుతోందని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 2019లో ఎన్‌డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 436 స్థానాల్లో పోటీ చేస్తే 303 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీతో కలసి బరిలో దిగిన మిత్రపక్షాలకు 26మాత్రమే లభించాయి. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం జనతాదళ్‌ సెక్యులర్‌ ప్రయత్నించింది. కానీ ఆ ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. అలాగే జలంధర్‌ ఉప ఎన్నికల్లో అకాలీదళ్‌ను కాదని బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. దీంతో అక్కడ ఆమ్‌ఆద్మీ గెలుపొందింది.

ఓ వైపు విపక్ష కూటమి బలపడుతున్న సంకేతాలున్నాయి. మమత బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌ కూడా విపక్షకూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మణిపూర్‌ ఘటనను మతాల మధ్య ఘర్షణగా చిత్రీకరించడంలో కేంద్రం సఫలమైంది. జాతుల సమస్య నుంచి దీన్ని హిందూ, క్రీస్టియన్‌ వివాదంగా మార్చగలిగింది. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి మరింత బలపడకముందే ఎన్నికలకెళ్తే తిరిగి మెజార్టీ స్థానాలు సాధించి మళ్ళీ అధికారంలోకి రావొచ్చన్నది బీజేపీ ఆకాంక్షగా స్పష్టమౌతోంది. బీజేపీతో పాటు పలు పార్టీలు కూడా ఈ దిశగా వ్యూహాలను అమల్లో పెట్టేశాయి. తమ సామర్థ్యాన్ని అంచనాలేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లొస్తాయన్న సర్వేలు చేపట్టాయి. ఇవన్నీ జాతీయ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఏ పార్టీ కూడా రాష్ట్రాల స్థాయిలో తమకొచ్చే అసెంబ్లి సీట్లను పరిగణనలోకి తీసుకోవడంలేదు. ముందుగా లోక్‌సభ ఎన్నికల్లో సాధించగలిగే సీట్లపైనే ఫోకస్‌ పెట్టాయి. ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోనూ మొత్తం 25స్థానాల్లో కనీసం 24స్థానాలు వైకాపా గెల్చుకుంటుందన్న నివేదికలు బహిర్గతమయ్యాయి. ఒక్క ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడు లోక్‌సభ స్థానాల్లో గెలుపుపైనే ప్రధాన పార్టీలన్నీ దృష్టి కేంద్రీకరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement