Monday, April 29, 2024

TS | చేప ప్ర‌సాదానికి క్యూ క‌ట్టిన జ‌నం.. నాంప‌ల్లి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

మృగశిర కార్తె సందర్భంగా పంపిణీ చేసే చేప ప్రసాద (ఉబ్బ‌సం వ్యాధిగ్ర‌స్తుల‌కు) అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇవ్వాల (శుక్రవారం) ఉదయం నుంచి ఈ ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించనున్నారు. ఇక‌.. చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు హైద‌రాబాద్ సిటీతో పాటు ఇత‌ర జిల్లాలు, రాష్ట్రాల‌ నుంచి వేలాది మంది నాంప‌ల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి తరలివచ్చారు.

చేపప్రసాదం పంపిణీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ఇప్పటికే బారులు తీరారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గురువారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్‌ మైదానంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ జిల్లా ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జాయింట్‌ కమిషనర్‌ విశ్వ ప్రసాద్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. కాగా, మత్స్యశాఖ ఆరు లక్షల చేప పిల్లలను సిద్ధంగా ఉంచి అవసరమైన మేరకు ఎగ్జిబిషన్‌ మైదానానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వీటిని 32 కౌంటర్ల ద్వారా పంపిణీ జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కిటకిటలాడుతున్న ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌..
ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి ఉబ్బస వ్యాధిగ్రస్తులు, వారి సహాయకులు పెద్ద ఎత్తున‌ తరలిరావడంతో నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్ సంద‌డిగా మారింది. అక్క‌డికి చేరుకున్న వారికి ఫలహారాలు, భోజన సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాయి. క్యూలైన్లలో జనం నిండిపోయారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement