Friday, May 3, 2024

హర్యానాలో ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్!

దేశంలో కరోనా ప్రళయం కొనసాగుతున్న వేళ.. రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి కరోనా బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా యూపీ, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, కర్ణటాక తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కోవిడ్ -19 రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయలేకపోతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రాష్ట్రాలు కేంద్రం సాయాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అయితే, హర్యానాకు ఆక్సిజన్ తో వచ్చిన ఓ ట్యాంకర్ అదృశ్యమైంది. పానిపట్ నుండి సిర్సా వెళ్లే ఆక్సిజన్ ట్యాంకర్ కనిపించకపోవడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, హర్యానాలో గత 24 గంటల్లో 9623 కరోనా కేసులు నమోదు కాగా, 45 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,81,247కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,528 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం హర్యానాలో 55,422 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3,22,297 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 84.54 శాతంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ డౌన్ తరహాలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. మాస్కులు, భౌతిక దూరం లాంటి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు స్పష్టం చేసింది.

మరోవైపు క‌రోనా కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో చాలా రాష్ట్రాలు ఆక్సిజ‌న్ కొర‌త ఉన్నద‌ని ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆక్సిజన్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అయితే, ఇండియాలో అతిపెద్ద ఆక్సిజ‌న్ త‌యారీదారు ఐనాక్స్ ఎయిర్ ప్రోడ‌క్ట్స్ మాత్రం అలాంటిదేమీ లేద‌ని చెబుతోంది. దేశంలోని మెడిక‌ల్ ఆక్సిజ‌న్ మార్కెట్‌లో 50 శాతం ఈ సంస్థే త‌యారు చేస్తుంది. అయితే ప్రస్తుతం దేశానికి అవ‌స‌ర‌మైనంత ఆక్సిజ‌న్ ఉత్పత్తి అవుతోంద‌ని ఐనాక్స్ ఎయిర్ ప్రోడ‌క్ట్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement