Friday, May 17, 2024

ఓరి దేవుడా మూవీ రివ్యూ..ఎలా ఉందంటే..

ఓ మై కడవులే అనే తమిళ సినిమా ఆధారంగా ఒరిజినల్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు రూపొందించిన చిత్రం ఓరి దేవుడా. దిల్ రాజు.. ప్రసాద్ వి.పొట్లూరి లాంటి అగ్ర నిర్మాతలు కలిసి నిర్మించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ ఏంటంటే.. అర్జున్ (విశ్వక్సేన్).. అను (మిథిలా పాల్కర్) చిన్నప్పట్నుంచి స్నేహితులు. అను తనను ఇష్టపడడంతో ఆమెతో పెళ్లికి ఓకే అంటాడు అర్జున్. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ అను పట్ల అర్జున్ కు ఎలాంటి ఫీలింగ్స్ ఏర్పడవు. వారి కాపురంలో కలహాలు రేగుతాయి. ఇద్దరూ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అనుతో జీవితం నరకప్రాయం అనుకుని ఆమెతో విడిపోవడానికి సిద్ధపడ్డ అర్జున్ కు ఒక దైవదూత రెండో అవకాశం ఇస్తాడు. ఆ ఛాన్స్ ఏంటి.. దాని వల్ల అర్జున్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. చివరికి అనుతో అతడి ప్రయాణం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.

విశ్లేషణ.. జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది ఉండి.. జీవితాలను చక్కదిద్దుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ ఈ చిత్రంలో హైలైట్. ఇలాంటి ఫాంటసీ ఐడియాలు ఎవరికైనా నచ్చుతాయి. యూనివర్శల్ గా అనిపిస్తాయి. కాబట్టి తెలుగులోనూ ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయింది. సినిమా ఆద్యంతం ఉండే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ‘ఓరి దేవుడా’కు పెద్ద ప్లస్. చాలా వరకు ఇందులో సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగిపోతాయి. కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కవుట్ అయిన ఈ సినిమాలో.. ఎమోషన్లు బాగా పండాయి. కాకపోతే స్లో నరేషన్ వల్ల అక్కడక్కడా బోర్ ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొత్తానికి హైలైట్ గా అనిపించే ఎపిసోడ్ ద్వితీయార్ధంలో వస్తుంది. తాను మరోలా అర్థం చేసుకున్న హీరోయిన్ తండ్రికి సంబంధించిన నేపథ్యంలో.. అందులోని ఎమోషన్ ప్రేక్షకులను కదిలిస్తుంది. చాలా హృద్యంగా అనిపించే ఈ సన్నివేశాలను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. ఐతే ఇక్కడ ఎమోషనల్ టర్న్ తీసుకునే సినిమా చివరి దాకా ప్రేక్షకులను అదే మూడ్ లో ఉంచుతుంది. హీరోలో రియలైజేషన్ రావడం మొదలయ్యాక.. ప్రతి సన్నివేశం అదే తరహాలో నడుస్తుంది. ఇక చివరి దాకా కథ ఎలా నడుస్తుందో ప్రేక్షకులకు ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. రాను రాను మెలో డ్రామా ఎక్కువపోయి.. సినిమా మరీ నెమ్మదిగా నడుస్తున్న భావన కలుగుతుంది. కానీ ఏ సన్నివేశం కూడా బాగా లేదు అనిపించకపోవడం ప్లస్. అంతా బాగానే ఉన్నా లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం ఎక్కడా వర్కవుట్ అయినట్లు అయితే అనిపించదు. ఓవరాల్ గా చూస్తే ‘ఓరి దేవుడా’లో టైంపాస్ వినోదానికి ఢోకా లేదు. ఎమోషన్లు.. కామెడీ బాగానే వర్కవుట్ అయ్యాయి.

- Advertisement -

నటీనటులు..

విశ్వక్సేన్ మంచి పెర్ఫామర్ అనే విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భార్యతో వేగలేక ఇబ్బంది పడే సగటు భర్తగా ఫ్రస్టేషన్ చూపించే సన్నివేశాల్లోనే కాక.. ఎమోషనల్ సీన్లలోనూ అతను ఆకట్టుకున్నాడు. మిథిలా పార్కర్ హీరోయిన్ లాగా కాకుండా ఒక సగటు అమ్మాయిలా కనిపిస్తుంది. పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. మరో హీరోయిన్ ఆశా భట్ పర్వాలేదు. మురళీ శర్మ కీలక పాత్రలో మెరిశారు. తన అనుభవాన్ని చూపించారు. కనిపించేది తక్కువ సేపే అయినా.. కీలకమైన క్యామియో రోల్ లో విక్టరీ వెంకటేష్ ఆకట్టుకున్నాడు. ఆయన ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్నిస్తాడు. వెంకీ అసిస్టెంటుగా రాహుల్ రామకృష్ణ కూడా మంచి జోష్ ఇస్తాడు. హీరో స్నేహితుడిగా వెంకటేష్ కాకుమాను ఓకే.

సాంకేతికత.. మాతృకకు పని చేసిన సాంకేతిక నిపుణులతోనే తెలుగు వెర్షన్ కు కూడా కొనసాగించాడు అశ్వత్ మారిముత్తు. వాళ్లు ఒరిజినల్ అందం చెడకుండానే మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఔట్ పుట్ ఇచ్చారు. లియాన్ జేమ్స్ సంగీతం హుషారుగా సాగింది. అనిరుధ్ పాడిన గుండెల్లోన పాట మంచి ఊపు తెస్తుంది. మిగతా పాటలు.. నేపథ్య సంగీతం కూడా బాగున్నాయి. విధు అయ్యన్న ఛాయాగ్రహణం నీట్ గా.. కలర్ ఫుల్ గా సాగింది. రెండు పెద్ద బేనర్లు కలిసి నిర్మించిన చిత్రంలో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. తరుణ్ భాస్కర్ మాటలు సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement