Monday, April 29, 2024

Spl Story: దేశంలోనే నెంబర్​ వన్​ తెలంగాణ.. అతిపెద్ద ఫ్లోటింగ్​ సోలార్​ పవర్​తో మరో ఖ్యాతి!

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్​ సోలార్​ పవర్​ ప్రాజెక్టు ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే ఉంది. సీఎం కేసీఆర్​ దార్శనికతకు ఇది గొప్ప నిదర్శనంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పవర్​ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో విద్యుత్​ సామర్థ్యం కూడా పెరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుతో పెద్ద మొత్తంలో విద్యుత్​ ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో సోలార్‌తో సహా పునరుత్పాదక ఇంధనం మొత్తం స్థాపిత సామర్థ్యం దాదాపు 4,000 మెగావాట్లుగా ఉండడం గొప్ప విషయమని విద్యుత్​ రంగ​ నిపుణులు చెబుతున్నారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

భారత దేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలంగాణలోని రామగుండంలో పూర్తిగా వర్క్​లోకి వచ్చింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్ట్ కింద భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL) ద్వారా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 100 మెగావాట్ల (MW) ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. 20 మెగావాట్ల సామర్థ్యం వాణిజ్య కార్యకలాపాలకు వెచ్చించనుంది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఈ ప్లాంట్ పూర్తిగా ప్రారంభంలోకి వచ్చింది. NTPC థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్‌లో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీంతో భూ వనరులను ఆదా చేయడంతోపాటు… నీటి ఆవిరిని తగ్గించడం అనే కాన్సెప్ట్​ కూడా అమల్లోకి వచ్చినట్టయ్యింది.

ఒకే చోట దేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ ఇదేనని అధికారులు తెలిపారు. తేలియాడే సోలార్ ప్యానెల్స్ ఉండటం వల్ల నీటి వనరుల నుండి బాష్పీభవన అంటే నీళ్లు ఆవిరి అయ్యూ (evaporation)  రేటు తగ్గుతుంది. దీంతో నీటి సంరక్షణకు కూడా ఈ ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​ సహాయపడుతుంది. ఏడాదికి సుమారుగా 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించడంలో ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా సంవత్సరానికి 1.65లక్షల టన్నుల బొగ్గు వినియోగం, 2.10లక్షల టన్నుల కార్బన్​డయాక్సైడ్​ ఉద్గారాలను కూడా నివారించవచ్చు.

రూ.423 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్రాజెక్టు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణ అనుకూల లక్షణాలతో కూడిన ఈ ప్లాంట్ క్లీన్ పవర్‌ను ఉత్పత్తి చేస్తూ జల జీవావరణ వ్యవస్థను నిర్వహించేలా చూస్తుందని భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్ట్​ని 40 బ్లాక్‌లుగా విభజించారు. ఒక్కొక్కటి 2.5 మెగావాట్లుగా ఉంటుంది. ప్రతి బ్లాక్‌లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్, 11,200 సోలార్ మాడ్యూల్‌ల శ్రేణి ఉంటుంది.

- Advertisement -

ఇక.. ఫ్లోటింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ ఫార్మర్, HT బ్రేకర్ ఉంటాయి. హై డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) మెటీరియల్‌తో తయారు చేసిన ఫ్లోటర్‌లపై సోలార్ మాడ్యూల్స్ ఉంచుతారు. మొత్తం ఫ్లోటింగ్ సిస్టమ్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బెడ్‌లో ఉంచిన డెడ్ వెయిట్‌లకు ప్రత్యేక హై మాడ్యులస్ పాలిథిలిన్ (HMPE) తాడు ద్వారా లంగరు వేసి ఉంచుతారు. ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డు వరకు 33కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్‌ను తరలిస్తున్నారు.

సోలార్ PV మాడ్యూల్స్, ఫ్లోటర్స్, బయోడిగ్రేడబుల్ నేచురల్ ఈస్టర్ ఆయిల్ నిండిన ఇన్వర్టర్ -డ్యూటీ ట్రాన్స్ ఫార్మర్లు, స్విచ్ గేర్, SCADA (పర్యవేక్షక నియంత్రణ, డేటా సేకరణ) కేబుల్స్ వంటి సోలార్ ప్లాంట్‌లోని అన్ని ప్రధాన భాగాలు దేశీయంగా తయారైనవే కావడం గమనార్హం. కాగా, రామగుండం వద్ద ప్రాజెక్ట్ ప్రారంభించడంతో దక్షిణ ప్రాంతంలో ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యం యొక్క మొత్తం వాణిజ్య ఆపరేషన్ ఇప్పుడు 217 మెగావాట్లకు పెరిగిందని NTPC తెలిపింది.

మహారత్న కంపెనీ ఇట్లాంటి సోలార్​ ఫ్లోటింగ్​ ప్లాంట్లకు ఇంపార్టెన్స్​ ఇస్తోంది. దేశంలోని అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లలో సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భూమిపై ఒక MW సోలార్ ఫోటో-వోల్టాయిక్ ప్లాంట్‌కు ఐదు ఎకరాల భూమి అవసరం. భూసేకరణ చాలా కష్టతరంగా మారినందున NTPC ఫ్లోటింగ్ పద్ధతిని అనుసరిస్తోంది. దక్షిణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నందున NTPC దక్షిణ ప్రాంతంలో తేలియాడే సోలార్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. తేలియాడే ప్లాంట్స్​ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నీటి వనరులు శీతలీకరణ ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి, ఇది సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానెల్‌ల పనితీరును 5 నుండి 10 శాతం మెరుగుపరుస్తుంది. దీని అర్థం ప్లాంట్ యజమానులకు భారీగా ఖర్చు ఆదా అవుతుంది. ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని అధికారులంటున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement