Saturday, October 5, 2024

విశిష్టతల వైభవం – తెలంగాణ శ్వేత సౌధం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ఖ్యాతి, కేసీఆర్‌ పాలన విశిష్టత ప్రపంచం నలుమూలలకు విస్తరించేలా కొత్త సచివాలయం సరికొత్త హంగులతో, ఎన్నో విశిష్టతలతో రూపుదిద్దుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఐకాన్‌గా చెప్పుకునే వైట్‌హౌస్‌ను తలపించేలా ”తెలంగాణ శ్వేత సౌధం” నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి, విస్తరణలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరంలో మరో కీర్తి కిరీటంగా నిలిచింది. గోల్కొం డ, చార్మినార్‌ తరహాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ పాలనా సౌధం చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఆ పక్కనే దేశం గర్వించదగిన స్థాయిలో 125 అడుగుల ఎత్తయిన భారీ అంబేద్కర్‌ విగ్రహం, ముందు భాగంలో సాగర్‌ తీరాన ఉవ్వెత్తు సాగిన ఉద్యమానికి ప్రతీకగా ‘అమర జ్యోతి’ నిర్మాణం అద్భుతాలను కళ్ళముందు ఉంచుతోంది. అత్యాధు నిక సదుపాయాలు, వసతులతో దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ సచివాలయం పేరు మారుమ్రోగుతోంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి నా ఉద్యోగులు పని చేసుకునేందుకు వీలుగా గాలి, వెలుతురు వచ్చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంజనీర్లు డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తులు, 635 గదులు, 24 లిఫ్టులు, నాలుగు గుమ్మాలు, 875 తలుపులతో భారీ నిర్మాణం అన్ని హంగులతో ప్రారంభానికి సంసిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

ఐదంచెల భద్రత
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయానికి ఐదంచెల భద్రత ఏర్పాటు- చేశారు. నూతన సచివాలయానికి పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యతను డీజీపీ అంజనీకుమార్‌ తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ విభాగానికి అప్పగించారు. సచివాలయం ప్రారంభమైన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజల రాకతో సచివాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయే అవకాశం ఉన్నందున భద్రతాపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు కంపెనీల బలగాలు నిరంతరం గస్తీ కాస్తాయి. సచివాలయానికి పక్కనే అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం, ఎన్టీఆర్‌ ఘాట్‌, పక్కనే హుస్సేన్‌ సాగర్‌, నెక్లెస్‌ రోడ్‌ ఈవెంట్స్‌, ఆ పక్కనే ఐమాక్స్‌ ఉండటం, ఆ ప్రాంతమంతా టూరిస్ట్‌ స్పాట్‌గా మారడంతో భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు- చేశారు. బెటాలియన్‌ నుంచి ఒక్కో కంపెనీలో 90 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో ముగ్గురు కమాండెంట్లు-, ఆరుగురు అసిస్టెంట్‌ కమాండెంట్లు-, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు సిబ్బంది ఆరుగురు, ఆర్‌ఎస్‌ఐలు 12 మంది, ఏఎస్‌ఐలు 18 మంది, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 90 మంది ఉంటారు. ఇలా మూడు కంపెనీల నుంచి మొత్తం 270 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కంపెనీల బలగాలకు తోడు ఆక్టోపస్‌ నుంచి ఓ యూనిట్‌ సచివాలయ భద్రతకు కేటాయించారు. ఈ స్పెషల్‌ యూనిట్లో మొత్తం 21మంది సిబ్బంది ఉంటారు. వీరికి ర్యాంకులవారీగా విధి విధానాలు ఉంటాయి. సిటీ- సెక్యూరిటీ- వింగ్‌కు చెందిన 80మంది సిబ్బంది కూడా సచివాలయ భద్రతలో భాగం కానున్నారు. వీరు ప్రత్యేకంగా చెకింగ్‌, బ్యాగేజీ చెకింగ్‌, బాంబ్‌, మెటల్‌ చెకింగ్‌ వంటి విధులు నిర్వర్తిస్తారు. ఈ విభాగంలో అడిషనల్‌ డీసీపీ ర్యాంకు అధికారి ఒకరు, ఏసీపీ ర్యాంకు అధికారులు ముగ్గురు, ఆర్‌ఐలు ఆరుగురు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు- సివిల్‌ పోలీసుల (సివిల్‌ ఫోర్స్‌) నుంచి ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, మిగతా సిబ్బంది మొత్తం కలిపి 32 మంది కేవలం సచివాలయ భద్రత కోసం పనిచేస్తారు. ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి అడిషనల్‌ ఎస్పీ ఒకరు, ఏసీపీ ఒకరు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది భద్రతలో భాగమవుతారు. ఇక స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి ఏసీపీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, సుమారు 8 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ
సచివాలయ పరిసరాల పరిధిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు- చేసింది. ఇందుకోసం సుమారు 25 మంది ట్రాఫిక్‌ సిబ్బంది షిప్టలవారీగా విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం సెక్రటేరియట్‌కు 22 మంది ట్రాఫిక్‌ సిబ్బందిని కేటాయించారు. ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ, మిగిలిన ర్యాంకుల సిబ్బంది ఉంటారు. వీరు సెక్రటేరియట్‌ పార్కింగ్‌, సీఎం మూమెంట్‌, మంత్రుల పార్కింగ్‌, విజిటర్స్‌ పార్కింగ్‌, ఉద్యోగులు, పౌరుల కోసం పనిచేస్తారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ భారీ విగ్రహం, సచివాలయ ప్రాంతాలకు ఎక్కువగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉండటంతో.. సచివాలయంలోకి వెళ్లే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు విధులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్‌ సిబ్బందిని సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ రద్దీ పెరిగిన మరుక్షణమే సిబ్బందిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సిటీ- పోలీస్‌, ఆక్టోపస్‌, ఇంటలిజెన్స్‌, ట్రాఫిక్‌ వంటి విభాగాలను సమన్వయం చేసుకుంటూ కట్టు-దిట్టమైన భద్రతను కల్పిస్తారు. రక్షణ విషయంలో రాజీ లేకుండా పహారా కాసే మూడు కంపెనీల సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement