Friday, April 26, 2024

ఢిల్లీ చేరిన నేపాల్ ప్రధాని దేవుబా.. ఇండియాలో మూడు రోజుల పర్యటన

నేపాల్‌ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ దాకా అంటే మూడు రోజుల పాటు భారత్‌లో ఆయన పర్యటించనున్నారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవుతారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్‌ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా సమావేశమవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, ఆర్థిక భాగస్వామ్యం, వ్యాపారం, ఆరోగ్య రంగంలో సహకారం, ఇరు దేశ ప్రజల అనుసంధానం, నేపాల్‌-భారత్‌ మధ్య నెలకొన్న సమస్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అనంతరం ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని (కాశి క్షేత్రాన్ని) ఆయన సందర్శిస్తారు. అక్కడి ఆలయాలను దర్శిస్తారు.

కాగా, 2021 జూలైలో నేపాల్‌ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన షేర్ బహదూర్ దేవుబా అనంతరం భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. ఆయన గతంలో నాలుగు సార్లు ఆ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భారత్‌లో పర్యటించారు. ఆయన చివరిగా 2017లో భారత్‌ను సందర్శించారు. మరోవైపు భారత్‌, నేపాల్‌ మధ్య ఒక సంప్రదాయం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఇరు దేశాధినేతలు షెడ్యూల్‌ మేరకు భారత్‌, నేపాల్‌ను సందర్శిస్తుంటారు. అలాగే భారత్‌, నేపాల్‌ ఆర్మీ జనరల్స్‌ కూడా ఇరు దేశాల్లో పర్యటిస్తుంటారు. ఈ సందర్భంగా ఆయా దేశాల జనరల్‌ ర్యాంక్‌తో వారిని గౌరవిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement