Wednesday, April 17, 2024

National – ప‌వ‌ర్ సెంట‌ర్‌ సౌతిండియా! మోదీ దక్షిణయానం!

ఇటు అభివృద్ధి.. అటు సంక్షేమ మంత్రం
కేరళ అంతరిక్ష కేంద్రంలో రూ.1800 కోట్ల ప్రాజెక్టుల ఆవిష్కరణ
తమిళనాడులో అభివృద్ధి కబురు
తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్టుకు శంకుస్థాపన
పలు రైలు ప్రాజెక్టులు జాతికి అంకితం
మహారాష్టలో సంక్షేమం ముచ్చట.. మహా రైతులతో ప్రధాని భేటీ
రూ.4,900 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

(ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ ప్రతినిధి) – రామబాణం వేగంతో ఉత్తర భారతంలో తిరుగులేనిశక్తిగా ఆవర్భవించిన బీజేపీ.. ఇక దక్షిణాదిన‌ కమల తోరణాలను విస్తరిస్తోంది. అభివృద్ధిలో, సంక్షేమ ఫలాల్లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహావేశాలను వెళ్లగక్కుతుంటే… ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీలూ ప్రత్యక్ష, పరోక్ష సహకారంలో ఉన్నాయి. ఈ స్థితిలో తమ లక్ష్యం 370 సాధించాలంటే దక్షిణాదిలో ఎంపీ స్థానాలు పెరగాల్సిందే. కర్నాటకలో ప్రభుత్వం చేజారినా.. లోక్‌స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు బ‌లం తిరిగి పెంచుకోవాలి. కానీ, మిగిలిన రాష్ట్రాల్లోనే బీజేపీ బలం అంతంత మాత్రంగానే ఉంది. ఇలా ద‌క్షిణాదిన బ‌లం పెంచుకునేందుకు ప్రధాని మోదీ తన వ్యూహానికి పదును పెట్టారు. యువత, మహిళ, రైతులే లక్ష్యంగా వరాలు కుమ్మరించే క్రతువును ప్రారంభించారు. మంగళవారం నుంచి రెండు రోజులపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇందులో కేరళ, తమిళనాడు ఉండగా.. మహారాష్ట్రలోనూ మోదీ పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

కేరళలో అభివృద్ధి మంత్రం

కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సాగనుంది. పీఎస్ ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ, సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీతో సహా మొత్తం రూ.1,800 కోట్ల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్ పురోగతిని ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. అంతరిక్ష పరిశోధనలో పురోగతి సాధించిన వ్యోమగాములకు ఆయన ‘ఆస్ట్రోనాట్ వింగ్స్’ ప్రదానం చేస్తారు.

తమిళనాడులోనూ..

తమిళనాడులో ఆటోమోటివ్ పరిశ్రమలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ కి మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. టీవీఎస్ ఓపెన్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్, టీవీఎస్ మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిదంబరనార్ ఓడరేవులో ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్‌కు, దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా పోర్టులను తీర్చిదిద్దే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.తమిళనాడులో రైలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. కొత్త రహదారులను ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో నీటిపారుదల ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ధి పనుల నిమిత్తం రూ.4,900 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

- Advertisement -

మహా రైతులు, మహిళలతో సంక్షేమం ఊసు

మహారాష్ట్ర పర్యటనలో రైతులతో ప్రధాని మోదీ సమావేశం అవుతారు. పీఎం-కిసాన్,నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి పథకాల కింద నిధులను విడుదల చేస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నిధులు విడుదల చేస్తారు. ఓబీసీలబ్ధిదారుల కోసం ఆవాస్ ఘర్కుల్ యోజనను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. యావత్మాల్ నగరంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement