Sunday, April 28, 2024

ఆ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు – ఎట్టకేలకు వెల్లడించిన జూబ్లిహిల్స్‌ పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెండు రోజుల క్రితం తీగల వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారకులెవరనేది పోలీసులు తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని అఫ్రాన్‌ అనే యువకుడు నడిపినట్లు గుర్తించారు. అఫ్రాన్‌తో పాటు కారులో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌తో పాటు మరో యువకుడు మహ్మద్‌ మాజ్‌ ఉన్నట్లు గుర్తించామని జుబ్లిహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అఫ్రాన్‌ వాహనం నడిపినట్లు సాంకేతిక ఆధారాలను కూడా సేకరించడం జరిగిందన్నారు. స్టీరింగ్‌పై ఉన్న ఫింగర్‌ ప్రింట్‌లతో పోల్చగా అఫ్రాన్‌ వాహనం నడిపినట్లు తేలిందని, దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మిగతా ఇద్దరిని వదిలేశామన్నారు. వీరిద్దరినీ ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తామన్నారు. ముగ్గురు మిత్రులు మెక్‌డొనాల్డ్స్‌లో తిని జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 వైపు వస్తుండగా ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని వారంతా పారిపోయారన్నారు. పారిపోయిన వారు ఎటు వైపు వెళ్ళారన్న సమాచారాన్ని స్థానికుల నుంచి సేకరించిన అనంతరం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించడం జరిగిందన్నారు. అంతేకాకుండా 100 సీసీ కెమెరాల పుటేజీలను కూడా పరిశీలించడం జరిగిందన్నారు.

ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన కారుపై బోధన్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం, పోలీసులు ప్రమాదానికి కారకులెవరన్న విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తాయి. మరోవైపు ఎమ్మెల్యే షకీల్‌ కూడా కారు తన మిత్రుడికి చెందినదని, అప్పుడప్పుడు తాను ఆ కారును వాడుతుంటానని చెప్పడంతో పాటు ప్రమాదం జరిగినపుడు తన కుమారుడు కారులో లేడని ప్రకటించారు. ఎన్నో క్లిష్టమైన కేసులలో గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు రెండేళ్ళ బాలిక మృతికి కారకులైన వారిని గుర్తించేందుకు రెండు రోజుల సమయం తీసుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement