Friday, May 3, 2024

బ్లాక్ మెయిల్ పనులు మానుకోః రేవంత్ కు మల్లారెడ్డి కౌంటర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢీ అంటే ఢీ అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి రేవంత్‌రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, తాను విసిరిన సవాల్‌కు రేవంత్ రెడ్డి తుస్సుమన్నాడని ఎద్దేవా చేశారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తన సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరించలేదని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పటినుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. టీడీపీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేవంత్‌ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012లో వైద్య కళాశాలను ప్రారంభించినట్లు మల్లారెడ్డి వివరించారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాలను స్థాపించామని, వసతి గృహాల్లో దాదాపు 7వేల మంది అమ్మాయిలు ఉంటున్నారన్నారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

జవహర్ నగర్ లో తన కోడలు పేరు మీద 448 సర్వే నెంబర్ లో 350 గజాల భూమి ఉందని చెప్పిన మంత్రి మల్లారెడ్డి.. జవహర్ నగర్ లో పేద ప్రజలకు హాస్పిటల్ లేదన్నారు. అందుకే హాస్పిటల్ నిర్మించామని తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం రోగులు అవసరమని.. స్థానికంగా ఉండే ప్రజలకు తమ మెడికల్ కాలేజీ ద్వారా వైద్యం అందిస్తున్నామని మల్లారెడ్డి తెలిపారు.

దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిరాక్స్ పేపర్లు తెచ్చి ఏదో చెప్తే సరిపోతుందా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. తన కళాశాలలు, ఆస్పత్రులుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. తాను ఎంపీగా రూ.200 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యాక కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి ప్రశ్నలు వేశారని.. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పిందని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ఆస్పత్రి కడితే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రేవంత్ ఎంపీ అయినా బ్లాక్‌మెయిల్ బుద్ధి పోలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన హోదాకి తగ్గట్టూ నడుచుకోవాలని మల్లారెడ్డి హెచ్చరించారు. తన కాలేజీలన్నీ మూయిస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడన్న మల్లారెడ్డి… ఇప్పటి వరకు తాను విసిరన సవాల్ ను స్వీకరించలేదన్నారు. ఇష్‌టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి మల్లారెడ్డి హితవు పలికారు.

రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభకి ప్రేమ్ సాగర్‌ను, ర్యావిరాల సభకు మల్ రెడ్డి బ్రదర్స్ ను బలి చేసిండని విమర్శించారు. మూడు చింతలపల్లిలో వజ్రేష్ యాదవ్‌ను, హరివర్దన్ ను బలిచేసాడన్నారు. ఒక్కో మీటింగ్‌కు రేవంత్ రెడ్డి రావాలంటే 50 లక్షలు డిపాజిట్ చేయాలని ఆరోపించారు. మరో సభకు బకరా కోసం నేతను వెతుకుతున్నాడన్నారు. చెట్టును, చెరువును చూస్తే కేసీఆర్ గుర్తుకు వస్తాడని, సీఎంపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమన్నారు. దివాళా తీసిన పార్టీకి రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాడని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఈ వార్త కూడా చదవండిః ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా దడ.. విద్యార్థులను వెంటాడుతున్న వైరస్

Advertisement

తాజా వార్తలు

Advertisement