Thursday, March 28, 2024

రేవంత్ ఫక్కీరు వేషాలు.. బండికి విలువ లేదు: ఎర్రబెల్లి

వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయా పార్టీల నేతలు కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నయా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఫక్కీరు వేషాలు మానుకోవాలన్న ఎర్రబెల్లి.. తొండి సంజయ్ మాటలకు విలువ లేదని ఎద్దేవా చేశారు. రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎంత మేరకు కొంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

సీఎంకి కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర మంత్రులు స్పష్టతను ఇవ్వడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత‌కైనా సిద్దంగా ఉందన్నారు. సీయం కేసిఆర్ ఆద్వ‌ర్యంలో ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుందన్నారు. తెలంగాణ ప‌ట్ల కేంద్రం ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతుందని ఆరోపించారు. కేంద్రంలోని బిజేపి సర్కార్ తెలంగాణ హ‌క్కుల‌ను కాల‌రాస్తుందన్నారు. రైతుల‌పై మొస‌లి క‌న్నీరు కారుస్తున్న పార్టీలు ఢిల్లీలో త‌మ స‌త్తా చాటాలని హితవు పలికారు. రాజ‌కీయాల కోసం ఇక్క‌డ తిరుగ‌డం కాదు.. ఢిల్లీ మెడ‌లు వంచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలన్నారు. తెలంగాణ‌లో రైతులు వానాకాలంలో పండించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను కొనుగోలు చేస్తామన్న మంత్రి ఎర్రబెల్లి.. రైతులు సంయమ‌నం పాటించాలని కోరారు. రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించడానికి వెంటనే చట్టాన్ని రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్నదాతల పోరాట ఫలితంగా కేంద్రం ఈ చట్టాలను ఉపసంహరించుకున్నది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు ప్రయోజనాలు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు.

నల్ల చట్టాల ఉపసంహరణ కోసం అమరులైన 700 మందికి పైగా రైతులు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున మొత్తం 21 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి దేశవిదేశాల నుండి ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతు ఉద్యమంలో అమరులైన 700 మందికి పైగా కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున వెంటనే ఆర్థిక సహాయం అందించాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు ఉద్యమం సందర్భంగా అన్నదాలపై పెట్టిన అన్ని రకాల కేసులను వెంటనే ఉపసంహరించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement