Sunday, April 28, 2024

కాలేశ్వరం లో కీలక ఘట్టం.. మల్లన్న సాగర్ ను ప్రారంభించనున్న సీఎం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతే కీలకమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. ఏడున్నర వేల కోట్ల రూపాయలతో చేపట్టిన రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించి నీటిని రిజర్వాయర్లోకి విడుదల చేసే అవకాశముంది.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ, ఎల్లంపల్లి, మధ్యమానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ల ద్వారా కొమరెల్లి మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తారు. ప్రధాన నదులపై కాకుండా నీటిని మళ్లించి నిల్వ చేసుకొనే రిజర్వాయర్లలో రాష్ట్రంలో ఇదే పెద్దది. ఇది అత్యధిక ఆయకట్టుకు నీరందించనుంది. అంతేకాకుండా కొండపోచమ్మ, బస్వాపూర్‌ రిజర్వాయర్ల కింద, సింగూరు కాలువలకు, తపాసుపల్లి రిజర్వాయర్‌ కింద, దుబ్బాక నియోజకవర్గానికి నీటిని ఇచ్చేది మల్లన్నసాగర్‌ నుంచే. ఈ భారీ రిజర్వాయర్‌ నిర్మాణం మూడేళ్లలోనే పూర్తి కావొచ్చింది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించడం, ఇంజినీర్లు గుత్తేదారులతో పనులు పరుగులు పెట్టించడానికి గట్టి ప్రయత్నం చేయడం ఇందుకు దోహదం చేశాయి.

ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 7,500 కోట్లు ఖర్చు చేయగా.. పదిహేడు వేల ఎకరాల భూమిని సమీకరించారు. మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో దీనిని చేపట్టారు. ఈ ఏడాది పది టీఎంసీలు నిల్వ చేయనున్నారు.

ఈ రిజర్వాయర్‌కు నాలుగు వైపులా తూములున్నాయి. కొండపోచమ్మ, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు నీటిని మళ్లించి ఆయకట్టుకు సరఫరా చేసేందుకు, రోజుకు ఒక టీఎంసీ నీటి విడుదలకు నాలుగు గేట్లతో ఒక స్లూయిస్‌ నిర్మించారు. దీనికింద ఎత్తిపోతల పనులన్నీ గతంలోనే పూర్తయ్యాయి. సింగూరు కాలువకు రోజుకు 0.6 టీఎంసీ సామర్థ్యంతో నీటిని వదలడానికి ఒక స్లూయిస్‌ ఏర్పాటు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఒకటి, తపాసుపల్లి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేందుకు మరొకటి నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement