Monday, April 29, 2024

Survivor Story: మృత్యువుతో ఆరు నెలల పోరాటం.. చావును గెలిచిన ఫ్రంట్​లైన్​ వర్కర్​..

కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తున్న వేళ ఓ ఫ్రంట్​ లైన్​ వర్కర్​ ఎలా వైరస్​కు గురయ్యాడు. తను ఎలాంటి కఠినమైన సిచ్యుయేషన్​ని ఎదుర్కొన్నాడు. తనకు అందిన సాయం.. మృత్యువుతో పోరాడి ఎలా సర్వైవ్​ అయ్యాడో.. ఓ సక్సెస్​ఫుల్​ స్టోరీ చదివి తెలుసుకుందాం..

అతని పేరు అరుణ్​కుమార్​. దుబాయ్​లో ఓ పేద్ద హాస్పిటల్​లో జాబ్​. అతని సొంత రాష్ట్రం మాత్రం కేరళ. హ్యాపీగా గడిచిపోతున్న అతని జీవితంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఫ్రంట్​లైన్​ వర్కర్​గా ఉన్న అరుణ్​కుమార్ అబుదాబిలోని LLH హాస్పిటల్​లో ఆపరేటింగ్​ థియేటర్​ (OT) టెక్నీషియన్​గా పనిచేస్తున్నాడు. అప్పటికి అతను13 ఏళ్లుగా ఆ ఆస్పత్రిలోనే పనిచేస్తున్నాడు​. తన డ్యూటీలో భాగంగానే అరుణ్​కుమార్​ కూడా కరోనా అటాక్​ అయ్యింది.

సెకండ్​ వేవ్​ టైమ్​.. గత ఏడాది జులైలో అబుదాబిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. విపరీతమైన కేసులు వస్తున్నాయి. తన డ్యూటీలో తీరికలేకుండా వర్క్​ చేస్తున్నాడు. పనిలో తలమునకలై ఉన్న అరుణ్​కుమార్​కి కాస్త నలతగా అనిపించింది. మరో రెండ్రోజులకు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇక తనకు కూడా కరోనా వచ్చిందని భావించి మెడికల్​ టెస్ట్​ చేయించుకున్నాడు. ఆ టెస్టుల్లో పాజిటివ్​గా తేలింది. అయితే అతను మనో ధైర్యాన్ని కోల్పోలేదు. ఎంతో మందిని ఇదే హాస్సిటల్​ నుంచి కోలుకోని సంతోషంగా ఇంటికి వెళ్లడం చూశాడు. అయినా తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఎక్కడో కాస్త జంకు అనిపించింది.

పాజిటివ్​ అని తేలిన వెంటనే అరుణ్​ తనకు తాను హోం క్వారంటైన్​లో ఉన్నాడు. అయితే తను అనుకున్నంత ఈజీగా హెల్త్​ రికవరీ అవుతుందనుకోలేదు. హెల్త్​ కండిషన్​ రోజు రోజుకూ దెబ్బతింటోంది. వైరస్​ ఊపిరితిత్తులను అటాక్​ చేసింది. తీవ్రమైన ఇన్​ఫెక్షన్​ సోకినట్లు చెకప్​లో తేలింది. శ్వాస తీసుకోవడంలో కాస్త కూడా రిలీఫ్​ కనిపించడం లేదు. చాలా ఇబ్బందిగా శ్వాస అందుతోంది. తన పరిస్థితి ఏంటో తనకు అర్థం అవుతోంది. ఇక తనకు చివరి ఘడియలు వచ్చినట్టు భావించాడు. అయినా చివరిదాకా పోరాడాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే తను పనిచేస్తున్న హాస్పిటల్​లోనే అడ్మిట్​ అయ్యాడు. అతని పరిస్థితి గమనించిన డాక్టర్లు కృత్రిమ ఊపిరితిత్తుల (ECMO యంత్రం) సహాయం అందించారు. దాంతో కాస్త ఫ్రీగానే ఊపిరి పీల్చుకుంటున్నాడు. అయితే ఆ తర్వాత చాలా కాంప్లికేషన్స్​ తలెత్తాయి. అతను గుండె ఆగిపోవడంతో సహా.. అనేక అడ్డంకులను ఎదురయ్యాయి. ట్రాకియోస్టోమీ, బ్రోంకోస్కోపీ కూడా చేశారు. అతని చికిత్సకు VPS హెల్త్ కేర్ అనే సంస్థ సపోర్ట్​గా నిలిచింది. వైద్యానికి కావాల్సిన ఫండ్​ని సమకూర్చింది. వారు అతనికి దాదాపు రూ.50 లక్షల దాకా ఆర్థిక సహాయం అందించారు.

- Advertisement -

అరుణ్ కృత్రిమ ఊపిరితిత్తుల సహాయంతో 118 రోజుల పాటు హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకున్నాడు. కరోనా సోకి మృత్యువు చివరి అంచులదాకా వెళ్లిన అతను అద్భుతంగా కోలుకున్నాడు. తన కుటుంబం,  స్నేహితులను కలవడానికి కేరళలోని తన సొంతింటికి రావడానికి రెడీ అయ్యాడు. డిశ్చార్జి రోజు అబుదాబిలోని బుర్జీల్ హాస్పిటల్‌లో ఒక పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్​తో పనిచేసే సహచర మిత్రులు అంతా కలిసి కొంత మొత్తం జమచేశారు. వారి నుండి టోకెన్‌గా అతనికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా అరుణ్ భార్యకు ఉద్యోగం ఇస్తామని ఆ హాస్పిటల్​ తెలిపింది. అతని పిల్లల చదువు కోసం అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని ఓ హెల్త్ కేర్ గ్రూప్ ముందుకొచ్చింది. ఇక అరుణ్​ కష్టాలన్నీ తీరినట్టే.. అయితే.. అతని జీవితం కోసం జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో.. తనకు ఏం జరిగిందనే విషయాలు చాలా గుర్తు లేవు అంటున్నాడు అరుణ్​. మృత్యువు కోరల నుంచి తప్పించుకున్నానని మాత్రం తెలుసు, నా కుటుంబ, దోస్తులు, వందలాది మంది ప్రార్థనల కారణంగా.. ఎంతోమంది దాతల సాయం కారణంగా నేనీ రోజు జీవించి ఉన్నాను అంటూ కన్నీరు పెట్టాడు.

అయితే.. మిన్నల్ మురళి స్టార్ టోవినో థామస్ బుర్జీల్ హాస్పిటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా లేటెస్ట్ హిట్ ‘మిన్నల్ మురళి’లో సూపర్ హీరో పాత్ర పోషించినా.. నిజ జీవితంలో మాత్రం అరుణ్ లాంటి వాళ్లే సూపర్ హీరోలు అని కొనియాడారు.  అరుణ్​ లాంటి వ్యక్తికి సాయం అందించడం, అతడిని అన్ని రకాల ఆదుకోవడం చూస్తుంటే సమాజంలో ఇంకా మానవత్వం బతికే ఉందని స్పష్టమవుతోంది. ఇది మనందరికీ గర్వకారణం. అతని స్ఫూర్తిదాయకమైన పోరాటం గురించి తెలుసుకుని సంతోషించాను. నేను రీల్‌లో సూపర్‌హీరో మాత్రమే కానీ, మహమ్మారిని తరిమేయడంలో ముందుండి  పోరాడుతున్న అరుణ్ వంటి మిలియన్ల మంది ఫ్రంట్‌లైన్ యోధులే రియల్​ లైఫ్​లో సూపర్‌హీరోలు. ప్రాణాంతక వైరస్ నుండి ప్రపంచాన్ని రక్షించడంలో వారి నిబద్ధత, వృత్తి ధర్మం ఎంతో గొప్పది. మానవజాతి వారికి శాశ్వతంగా రుణపడి ఉంటుంది’’.. అని స్టార్​ హీరో టోవినో థామస్​ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement