Friday, April 26, 2024

నేటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్…యథావిధిగా బ్యాంకులు, ఏటీఎంలు

 కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించారు. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ కాలంలో ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. ఆ 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌ కఠినంగా అమల్లో ఉంటుంది

ఇక గ‌త లాక్‌డౌన్ స‌మ‌యంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు య‌థావిధిగా ప‌ని చేస్తాయ‌ని తెలంగాణ కేబినెట్ స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి అని తెలిపింది. లాక్‌డౌన్ నుంచి ప్రింట్ అండ్ ఎల‌క్ర్టానిక్ మీడియాకు మిన‌హాయింపు ఇచ్చింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యథావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement