Wednesday, May 15, 2024

బందీలకు విముక్తి, కిరణ్​బేడీ చేతికి భక్తిమాఫియా ఆశ్రమం.. దొంగబాబా కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలో భక్తిమాఫియా చేతిలో చిక్కుకున్న తెలంగాణ యువతి సంతోషి రూప కోసం ఆమె తల్లిదండ్రులు మొదలుపెట్టిన న్యాయపోరాటం ఫలించింది. సంతోషి రూప సహా 100 మందికి పైగా యువతులకు విముక్తి కల్పించేలా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో దొంగబాబా వీరేంద్ర దీక్షిత్ నెలకొల్పిన ఆశ్రమం ‘ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం’ను మాజీ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నేతృత్వంలోని కమిటీకి అప్పగించాలని హైకోర్టు పేర్కొంది. సంతోషి రూప తల్లిదండ్రులు మీనావతి, రాంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపిన్ సాంగీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఆశ్రమంలో బందీలుగా ఉన్న మహిళల ఆరోగ్య, మానసిక, సంక్షేమ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించేందుకు కిరణ్ బేడీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్టు హైకోర్టు తెలిపింది. కమిటీలో రోహిణీ జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్), ఢిల్లీ మహిళా నేర విభాగం డీసీపీ, జిల్లా న్యాయ సేవల విభాగం కార్యదర్శులను సభ్యులుగా నియమించింది.

ఈ ఆశ్రమంలో నిర్బంధంలో ఉన్న తమ కుమార్తె సంతోషి రూపను కలిసేందుకు అవకాశం కల్పించాలని రాంరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. సంతోషి రూపను గత ఏడేళ్లుగా తప్పుదోవపట్టించి అక్రమంగా నిర్భందించారని పిటిషన్లో పేర్కొన్నారు. తన కూతురిని కలవడానికి కూడా అశ్రమ నిర్వాహకులు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాశివుడి అవతారంగా తనను తాను ప్రకటించుకున్న దొంగ బాబా వీరేంద్ర దీక్షిత్, ప్రపంచం అంతమయ్యాక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం కోసం భక్తులను ఎంపికచేసుకున్నట్టు నూరిపోశాడు. ప్రస్తుతం ఆశ్రమంలో 168 మంది అమ్మాయిలు బందీలుగా ఉన్నారు. ఇరుకు గదుల్లో ఉంచి అమాయక మహిళలకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసినట్టు ఆశ్రమ నిర్వాహకులపై గతంలోనే ఆరోపణలు వచ్చాయి. 2017లో ఆశ్రమంపై అధికారులు దాడులు, సోదాలు నిర్వహించగా, దొంగ బాబా వీరేంద్ర దీక్షిత్ పారిపోయాడు. అత్యాచారం సహా అనేక తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వీరేంద్ర దీక్షిత్‌పై సీబీఐ ‘లుక్ అవుట్’ నోటీసు జారీచేయడంతో పాటు ఆచూకీ చెప్పినవారికి రూ.5 లక్షలు నజరానా కూడా ప్రకటించింది. కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆశ్రమం ప్రారంభించిన వ్యక్తే పరారీలో ఉన్నప్పడు ఆ ఆశ్రమాన్ని ప్రభుత్వానికి ఎందుకు అప్పగించకూడదని హైకోర్టు ప్రశ్నించింది. ఆశ్రమ వ్యవస్థాపకుడిపై రేప్ సహా 10 ఇతర కేసులు నమోదై, చార్జీషీటులు సైతం దాఖలైనప్పడు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సీబీఐని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆశ్రమంలో ఉన్న మహిళలను ఎక్కడకీ తరలించకూడదని, సంతోషి రూపను కలిసేందుకు తల్లిదండ్రులకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

ఎవరీ సంతోషి రూప?
అంతా సవ్యంగా సాగితే ఆమె దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలో ఒకరిగా మారేది. కెమికల్ ఇంజనీరింగ్ చేసి, అమెరికాలో పీహెచ్డీ పూర్తి చేసి, నానో టెక్నాలజీపై ఎన్నో పరిశోధనా పత్రాలను సమర్పించిన ఆ యువతి అకస్మాత్తుగా అదృశ్యమైంది. తల్లిదండ్రుల రెండేళ్ల అన్వేషణ అనంతరం ఆమె ఆచూకీ ఓ ఆశ్రమంలో తేలింది. అప్పటికే భక్తి పారవశ్యం నిలువెల్లా ఆవహించగా, ఆశ్రమం వీడి వచ్చేందుకు ససేమిరా అంటూ మొండికేసింది. అసలింతకీ ఆ ఆశ్రమం చరిత్ర ఏంటి? అంతగా ఆమెను ఆకట్టుకున్నదేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆమె తల్లిదండ్రులు దేశ రాజధాని ఢిల్లీలో ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ పట్టణానికి చెందిన దుంపల రామ్ రెడ్డి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ)లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసి పదవీ విరమణ చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికాలో నివసిస్తోంది. చిన్నమ్మాయి సంతోషి రూప అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లూయివిల్లీ యూనివర్సిటీలో ఎం.ఎస్ సీటు సంపాదించింది. 2005లో అక్కడకు వెళ్లిన రూప, ఎం.ఎస్‌తో పాటు పీహెచ్డీ కూడా అక్కడే పూర్తి చేసింది. 2012లో నానో టెక్నాలజీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోసం అయోవా యూనివర్సిటీలో చేరింది. పరిశోధన పూర్తి చేసి ఆ పత్రాలను కూడా సమర్పించింది. ఆమె పేరుతో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే మొదట కనిపించేవి ఆమె చేసిన పరిశోధనలు, వాటి తాలూకూ పత్రాలే. చిన్నతనం నుంచి దైవ భక్తి కల్గిన రూప, చదువులో, చేసే పనుల్లో ఏకాగ్రత సాధించడం కోసం ధ్యానం, మెడిటేషన్ వంటివి చేస్తుండేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అమెరికాలో చదువుకునే సమయంలో కూడా మెడిటేషన్ కొనసాగించేదని తెలిసింది. అయితే ఉన్నట్టుండి 2015 జులైలో రూప అకస్మాత్తుగా అదృశ్యమైంది. కంగారు పడ్డ తల్లిదండ్రులు అమెరికాలోని యూనివర్సిటీ అధికారులను సంప్రదిస్తే, రూప ఇండియాకే తిరిగి వెళ్లిందని, గ్రీన్ కార్డ్ మంజూరు చేయడం కోసం సిద్ధంగా ఉన్నా ఆమె నిరాకరించి మరీ స్వదేశానికి తిరిగొచ్చిందని సమాధానం ఎదురైంది. దీంతో ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు రూప కోసం అన్వేషణ ప్రారంభించారు. అనేక ప్రయత్నాల తర్వాత ఆమె ఢిల్లీలోని ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం పేరుతో ఉన్న ఓ ఆశ్రమంలో చేరినట్టు తెలిసింది.

అతికష్టంమీద ఆశ్రమానికి చేరుకున్న తండ్రి, కూతురిని కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పరిశోధనలతో శాస్త్రవేత్తగా మారి దేశానికి ఎంతో సేవ చేయాల్సిన కూతురు ఇలా నాలుగు గోడల మధ్య బందీగా మారిందేంటా అనుకుంటూ ఆవేదన చెందారు. ఎంత చెప్పినా కూతురు మనసు మారలేదు. తాను ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకుంటున్నానని, తననెవరూ ఆపవద్దని తేల్చి చెప్పింది. 2017 డిసెంబర్‌లో మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు ఆశ్రమంపై దాడి జరిపారు. మైనారిటీ తీరని అనేక మంది అమ్మాయిలను రెస్క్యూ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రైడ్ సమయంలో కొన్ని ఇంజక్షన్లు, సిరంజులు దొరకడంతో వాటిని ల్యాబ్ పరీక్షల కోసం పంపించడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ పరిస్థితులను గమనించిన రూప తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగింది. నిజంగా భక్తిమార్గంలో నడుస్తున్న ఆశ్రమమైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ భక్తి పేరుతో అమ్మాయిల్ని లోబర్చుకుని, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తండ్రి రామ్ రెడ్డి ఆందోళన చెందారు.

- Advertisement -

ఉత్తరాది రాష్ట్రాల్లో బాబా రామ్ రహీం సింగ్ నిర్వహించిన డేరా బాబా ఉదంతం సహా అనేక దొంగ స్వాములు, బాబాలు యువతులపై జరుపుతున్న అత్యాచారాల వార్తలు చూసి ఆయన ఆందోళన మరింత రెట్టింపవుతోంది. ఆ ఆశ్రమం చెర నుంచి కూతురుని విడిపించే క్రమంలో తండ్రి రామ్ రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేపట్టారు. దైవం పేరు చెప్పే ఆశ్రమాలేవైనా సరే సామాన్యులందరికీ ద్వారాలు తెరిచి ఉంచుతారని, కానీ ఇక్కడ బయటివారిని రానీయకుండా అడ్డుకుంటున్నారంటే కచ్చితంగా లోపల అసాంఘీక, అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని రాంరెడ్డి భావించారు. కన్నబిడ్డ కోసం ఆ వృద్ధ జంట చేపట్టిన న్యాయపోరాటానికి ఢిల్లీలోని న్యాయవాది శ్రావణ్ కుమార్ తోడయ్యారు. గతంలో మీడియాలో పనిచేసిన శ్రావణ్ కుమార్, ఇలాంటి ఆశ్రమాల్లో చోటుచేసుకునే దుశ్చర్యలపై కోర్టుకు వివరించి చెప్పారు. ఫలితంగా ఆశ్రమంలో బందీలుగా ఉన్న 100 మందికి పైగా యువతులకు ఆశ్రమ నిర్వాహకుల నుంచి విముక్తి కలిగేలా తీర్పు సాధించగలిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement