Friday, May 17, 2024

డేటా సైన్స్‌, కృత్రిమ మేథ నేర్చుకోండి.. యువ బ్యూరోక్రాట్లకు ప్రధాని మోదీ పిలుపు

టెక్నాలజీలో వస్తున్న కాలానుగుణ మార్పులను బ్యూరోక్రాట్లు స్వీకరించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బ్యూరోక్రాట్లు డేటా గవర్నెన్స్‌, కృత్రిమ మేథస్సుకు సంబంధించిన ప్రతిదీ నేర్చుకోవాలని సూచించారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ కామన్‌ ఫౌండేషన్‌ కోర్సు వేడుకలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ ఐఏఎస్‌ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా స్ఫూర్తిని విస్మరించి, అధికార స్ఫూర్తిని తీసుకుంటే వ్యక్తులతోపాటు వ్యవస్థలూ నష్టపోతాయని నొక్కిచెప్పారు. పౌర సేవకులు నేర్చుకునే కృత్రిమ మేథస్సుకు సంబంధించిన ల్యాబ్‌ను అందుబాటులో ఉంచాలని అకాడమీ డైరెక్టర్‌ను కోరారు. అలాగే భవిష్యత్‌లో డేటా పెద్ద పవర్‌గా మారనుంది. ఇది ఇప్పటికే ప్రభావితంగా ఉంది. మనం డేటా సైన్స్‌ గురించి ప్రతిదీ నేర్చుకోవాలి. అర్ధం చేసుకోవాలి.

మనం ఎక్కడికి వెళ్లినా వాటిని అమలుచేయాలి అని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75వ సంవత్సరంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రస్తుత బ్యాచ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు. దేశం 100 సంవత్సరాల స్వాతంత్య్రోత్సవం జరుపుకునే నాటికి మాలో చాలా మంది ఉండరు. అయితే, మీరంతా ఇక్కడే ఉంటారు. కాబట్టి రాబోయే 25 ఏళ్లలో దేశం సాధించబోయే అభివృద్ధిలో మీ పాత్రే కీలకంగా ఉంటుందని తెలిపారు. సివిల్‌ సర్వీస్‌లో ఎందుకు చేరారు? ఏం సాధించాలని అనుకుంటున్నారు? అనే దానిపై సుదీర్ఘ వ్యాసం రాయాలని యువ ఐఏఎస్‌ అధికారులను ప్రధాని కోరారు. ఆ సుదీర్ఘ వ్యాసాలను క్లౌడ్‌లో ఉంచాలని చెప్పారు. 25 ఏళ్ల తర్వాత, ఈ ప్రదేశానికి తిరిగి వచ్చినప్పుడు, మా లక్ష్యాన్ని చేరుకునే మార్గంలోనే ఉన్నారా? లేక దారి మళ్లించబడ్డారా అని తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు.

ప్రతి పౌరుడి కోసం పనిచేయాలి..
యువ అధికారులు నిరంతరం తమను తాము సవాల్‌ చేసుకోవాలని, కంఫర్ట్‌ జోన్‌లోకి ఎప్పటికీ వెళ్లొద్దని ప్రధాని హితవు పలికారు. ఫైళ్లలో వచ్చే సంఖ్యలు కేవలం అంకెలు మాత్రమే కాదన్న విషయాన్ని ప్రభుత్వోద్యోగులు గుర్తించుకోవాలని చెప్పారు. ఆ సంఖ్యలలో ప్రతి ఒక్కటి కలలు, ఆకాంక్షలు, సవాళ్లతో కూడిన జీవితానికి సంబంధించినవి. కాబట్టి మీరు ప్రతి పౌరుడి జీవితం కోసంపనిచేయాలని హితబోధ చేశారు. పేదలకు పక్కా ఇళ్లు అందించడం, గ్యాస్‌ కనెక్షన్లు, విద్యుత్‌ తదితర పథకాల ద్వారా ఇతరత్రా సవాళ్లతో కూడిన పనులను బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. మీరు ఎక్కడికి వెళ్లినా ఇలాంటి కొన్ని సవాలక్ష సమస్యలను స్వీకరించండి. వాటిని పరిష్కరించడానికి కృషి చేయండి. అప్పుడు జిల్లా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని మోడీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement