Friday, May 17, 2024

Lata Mangeshkar: లతా మంగేష్కర్ గానం.. తరతరాలకు అమృతపానం

లతా మంగేష్కర్ పాట వినాలని ప్రతిపూట అనుకొనేవారు ఎందరో. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. లత పాటతోనే భావితరాలు సైతం పులకించి పోతాయి. ఆ గానకోకిల గాత్రంలోని మహత్తు అలాంటిది మరి!

లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. వారి కుటుంబం పాటల పొదరిల్లు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకళాకారుడు. ఆయనకు ఐదు మంది పిల్లలు. వారిలో లతనే అందరికంటే పెద్ద. ఆమె తరువాత ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఉన్నారు. దీనానాథ్ మరణంతో ఇంటి భారం చిన్నారి లతపైనే పడింది. కొన్ని చిత్రాల్లో బాలనటిగానూ నటించారు లత. తరువాతి రోజుల్లో లత గాయనిగా మారి ప్రతి పాటలోనూ అమృతం కురిపించారు. లత కంటే ముందు నూర్జహాన్, ఖుర్షీద్, సురయ్యా, షంషాద్ బేగం వంటి మేటి గాయనీమణులు రాజ్యమేలారు. వారు ఉన్న సమయంలోనే లత సైతం తనదైన బాణీ పలికించారు. తరువాతి రోజుల్లో లత పాటనే హిందీ సినిమాకు ఓ కొత్త బాటను చూపింది.

ఆ నాటి మేటి సంగీత దర్శకుల్లో నౌషద్ అలీదే పైచేయి. హిందుస్థానీ బాణీలకు జానపదం జోడించి నౌషద్ చేసిన ప్రయోగాలు ఆ కాలంలో జనాన్ని విశేషంగా అలరించాయి. లతలో అమృతం కురిపించే గానం దాగుందని నౌషద్ పసికట్టి ఆమెకు తగ్గ పాటలు పాడించారు. జనం మదిలో లతకు గానకోకిలగా పట్టం కట్టించారు. నౌషద్ స్వరకల్పనలో రూపొందిన ‘బైజూ బావ్రా’తోనే లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ ఇద్దరూ స్టార్ సింగర్స్ అయిపోయారు. తరువాత సి.రామచంద్ర, ఎస్డీ బర్మన్, శంకర్ జైకిషన్ వంటి సంగీత దర్శకులు సైతం లత గానంలోని మధురాన్ని తమ బాణీలతో జోడీ కట్టించారు. జనానికి మరపురాని మధురాన్ని పంచారు.ఈ నాటికీ ఆ మధురం పరవశింప చేస్తూనే ఉంది. ఇక లతతో మదన్ మోహన్ స్వరపరచిన పాటలు విశేషంగా అలరించాయి.

లత పాట రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను రంజింప చేసిన తరువాతనే ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా అవార్డు లభించింది. ఈ అంశం అప్పట్లో ఆమె అభిమానులకు ఆవేదన కలిగించింది. అయితే లత ఏ నాడూ అవార్డుల కోసమే అన్నట్టుగా పాడలేదు.1972లో రూపొందిన ‘పరిచయ్’ చిత్రంలో గుల్జార్ రాసిన పాటకు ఆర్డీ బర్మన్ స్వరకల్పనలో లత గానం చేసిన పాట ఆమెకు తొలి నేషనల్ అవార్డును సంపాదించి పెట్టింది. మరో రెండేళ్ళకు అంటే 1974లో ‘కోరా కాగజ్’ సినిమాలో కళ్యాణ్ జీ – ఆనంద్ జీ బాణీల్లో లతకు మరో నేషనల్ అవార్డు లభించింది. లతా మంగేష్కర్ ను మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం ‘లేకిన్’. ఈ చిత్రానికి ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతం సమకూర్చడం విశేషం. నాలుగు సార్లు ఉత్తమ గాయనిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు.

ఇక లత కీర్తి కిరీటంలో ప్రతిష్ఠాత్మక అవార్డులూ చోటు చేసుకున్నాయి. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న లత దరి చేరాయి. ఇలా దేశం గర్వించదగ్గ అవార్డులన్నీ లత గానామృతం చేరి మరింత వెలుగులు విరజిమ్మాయి.

- Advertisement -

తెలుగువారితోనూ లతకు విడదీయరాని బంధం ఉంది. 1955లో తెరకెక్కిన ఏయన్నార్ ‘సంతానం’ చిత్రంలో తొలిసారి లత నోట తెలుగుపాట పలికింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో లత తన తొలి తెలుగు పాట “నిదుర పోరా తమ్ముడా…” గానం చేసి అలరించారు. ఈ పాట ఈ నాటికీ సంగీతాభిమానులను పరవశింప చేస్తూన ఉంది. 1988లో నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఖరి పోరాటం’లో ఇళయరాజా స్వరకల్పలో “తెల్లచీరకు తకధిమి…” పాటను ఆలపించారు లత. ఇక 1991లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షన్ లో లతా మంగేష్కర్ గానం చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు. అలా నందమూరి, అక్కినేని కుటుంబాలతో లతకు అనుబంధం ఉంది. మరో విశేషమేమంటే, ఆ ఇద్దరు మహానటుల పేరున నెలకొల్పిన జాతీయ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో ఏయన్నార్ జాతీయ పురస్కారం లతా మంగేష్కర్ కు లభించాయి. మరపురాని మధురం పంచిన లతా మంగేష్కర్ గానం భావితరాలను సైతం పులకింప చేస్తూ మహదానందం కలిగిస్తూనే ఉంటుంది. ఇందులో ఎవరికీ ఏలాంటి సందేహమూ లేదని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement