Friday, May 17, 2024

సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా లారా.. హెడ్‌ కోచ్‌గా టామ్ మూడీ

సన్‌రైజర్స్‌ హెడ్‌కోచ్‌గా టామ్‌ మూడీని నియమిస్తున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ప్రకటించింది. ఆర్సీబీ మాజీ హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ డిప్యూటీ కోచ్‌గా నియమితుడయ్యాడు. బ్యాటింగ్‌ కోచ్‌గా విండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ బ్రియాన్‌ లారా, పేస్‌ బౌలింగ్‌ కోచ్‌గా సఫారీ స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌, ముత్తయ్య మురళీధరన్‌ స్పిన్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. టామ్‌ మూడీ ఇప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఫీల్డింగ్‌ కోచ్‌గా హేమంగ్‌ బదానీ ఎంపికయ్యాడు. ఈ మేరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం ట్వీట్‌ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌స్టెయిన్‌ కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు.

సఫారీ పేసర్‌ డేల్‌స్టెయిన్‌ ఐపీఎల్‌లో 2103 నుంచి 2015వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. డెక్కన్‌ ఛార్జర్స్‌, గుజరాత్‌ లయన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. మెగాలీగ్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్‌ 97వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ కెరీర్లో 93టెస్టుల్లో 439 వికెట్లు, 125వన్డేల్లో 196వికెట్లు, 47టీ20ల్లో 64వికెట్లు పడగొట్టాడు. కాగా సన్‌రైజర్స్‌ మెంటార్‌గా వ్యవహరించిన టీమిండియా మాజీ స్టార్‌ బ్యాటర్‌, హైదరాబాదీ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇటీవల నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఎ) హెడ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌వార్నర్‌ వైదొలిగాడు. ఐపీఎల్‌ 15వ సీజన్‌ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్‌ యాజమాన్యం ముగ్గురు ఆటగాళ్లును రిటెయిన్‌ చేసుకుంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (రూ.14కోట్లు), అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్‌ అబ్దుల్‌ సమద్‌ (రూ.4కోట్లు), ఉమ్రాన్‌ మాలిక్‌ (రూ.4కోట్లు) ఆరెంజ్‌ ఆర్మీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement